అమెరికా నిశ్చయించినా 2027లోపు … ఆ పని జరగకపోవచ్చు!
చంద్రునిపై ఈ దశాబ్దాంతానికి అమెరికన్ వ్యోమగాము లతోపాటు ఒక అంతర్జాతీయ వ్యోమగామి కూడా కాలుమోపుతారని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వాషింగ్టన్లో జాతీయ అంతరిక్ష మండలి సమావేశాన్ని నిర్వహించిన తరవాత అధ్యక్ష భవనం వైట్‌హౌస్, నాసాలు సంయుక్తంగా పై ప్రకటన చేశాయి. అమెరికన్ వ్యోమగాములతో పాటు చంద్రునిపై నడిచే అంతర్జాతీయ వ్యోమగామిని ఏ దేశం నుంచి ఎంపిక చేసేదీ వివరించలేదు. అర్థ శతాబ్ది తరవాత చంద్రునిపైకి మళ్లీ మానవుడిని పంపాలని అమెరికా నిశ్చయించినా 2027లోపు ఆ పని జరగకపోవచ్చు. ఇప్పటి నుంచి ఒకటి రెండేళ్లలో మాత్రం కెనడాకు చెందిన ఒక వ్యోమగామి ముగ్గురు అమెరికన్ వ్యోమగాములతో కలిసి వ్యోమనౌకలో చంద్రుడిని చుట్టివస్తారు. 1960, 70లలో నాసా అపోలో కార్యక్రమం కింద 12 మంది అమెరికన్లను చంద్రునిపై దింపింది.













