12,000 మంది అమెరికన్లకు ఉద్యోగాలు : ఇన్ఫోసిస్
వచ్చే రెండేళ్లలో 12,000 మంది అమెరికన్ ఉద్యోగుల నియమకానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఐదేళ్లలో అమెరికాలో 25,000 మంది నియామకానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. రెండేళ్లలో 10,000 మంది అమెరికన్ల నియామకాలను చేపట్టాలని 2017లో ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అనంతరం అమెరికాలో ఏకంగా 13,000 ఉద్యోగాలిచ్చింది. వీటికి అదనంగా తాజాగా వివిధ బాధ్యతల్లో 12,000 మంది తీసుకోనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అనుభవజ్ఞులైన టెక్నాలజీ వృత్తినిపుణులతో పాటు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి తాజా పట్టబధద్రులకు కూడా అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొంది.
హెచ్ 1బీ వీసాదారులకు వర్క్ వీసాలకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం అనేక నిబంధనలు విధించిన తరుణంలో ఇన్ఫోసిస్ ఈ ప్రకటన చేసింది. 2020 జూన్ త్రైమాసికం చివరి నాటికి ఇన్ఫోసిస్లో 2,39,233 మంది ఉద్యోగులున్నారు. గత మూడేళ్లుగా అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇన్ఫోసిస్ బాగా దృష్టి సారించిందని, ఈ సంఖ్యను విస్తరిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. కొవిడ్ మహమ్మారి ఆర్థికంగా కల్లోలం రేపుతున్న తరుణంలోనూ కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవికుమార్ తెలిపారు. అమెరికాలో 6 టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కేంద్రాలను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.













