ఇన్ఫోసిస్ మరో బ్యాడ్ న్యూస్
ఉద్యోగాల కోతపై తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. అమెరికా వీసా జారీ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేయడంతో ఉద్యోగులు తొలగించాలని నిర్ణయం తీసుకున్న ఇన్ఫీ, ఇప్పుడు జీతాలను కూడా పెంచడం లేదట. ఉద్యోగుల జీతాల పెంపును జులైకి వాయిదా వేసినట్టు సంస్థ చెబుతోంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్లైతే మరి కొంత కాలం ఆగాల్సిందేనని ఇన్ఫీ పేర్కొంది. సాధారణంగా ఏప్రిల్లో ఉద్యోగుల జీతాలను పెంచాల్సి ఉంది. అయితే లెవల్ 5, అంతకంటే తక్కువ ర్యాంకుల్లో ఉన్న ఉద్యోగుల జీతాల పెంపు గురించి జులైలో సమీక్ష ప్రారంభమవుతుందని, మిగతా ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి మార్పు ఉండదని ఇన్ఫీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు ఈ మెయిల్ ద్వారా సిబ్బందికి తెలియజేశారు. అంతేగాక, ఉద్యోగుల తొలగింపుపై కూడా ప్రవీణ్ రావు కొంత క్లారిటీ ఇచ్చారు. గతంలో మాదిరిగానే పనితీరును బట్టి కొన్ని ఉద్యోగాలు మాత్రమే తొలగిస్తామని ఆయన తెలిపారు.













