అమెరికాలో భారత విద్యార్థుల హవా
అమెరికా వర్సిటీల్లో రెండు లక్షల మందికిపైగా భారత విద్యార్థులు చదువుతున్నట్లు తాజా నివేదిక తెలిపింది. ఇక్కడ విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు వివరించింది. 2017 ఏడాదికి సంబంధించిన వివరాలపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (యూఎస్ఐసీఈ) ఈ నివేదిక విడుదల చేసింది. దీనిలో 4,81,106 మంది విద్యార్థులతో చైనా మొదటిస్థానంలో ఉంది. 2,49,763 మంది విద్యార్థులతో భారత్ తర్వాతి స్థానంలో ఉంది. శాస్త్ర, సాంకేతికత, ఇంజినీరింగ్, గణితం(స్టెమ్) కోర్సులకు సంబంధించి వృత్తివిద్య శిక్షణ (వోపీటీ)లో 50,507 మంది విద్యార్థులతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.













