యుఎస్ లో పెరిగిన మన విద్యార్థులు
అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రెండేళ్ల క్రితం మొదటిసారిగా రెండు లక్షల స్థాయిని దాటగా.. తాజాగా వారి సంఖ్య 2.27 లక్షలకు చేరింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజా గణాంకాలను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు.. జాత్యహంకార దాడుల ప్రభావంవల్ల అక్కడ మన విద్యార్థుల సంఖ్య తగ్గవచ్చని రెండేళ్లుగా భావిస్తున్నా.. గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. విద్యార్థుల సంఖ్య తగ్గకున్నా, పెరుగుదల శాతంలో మాత్రం మూడేళ్ల కిందట ఉన్న వ ద్ధి ఇప్పుడు లేదని నిపుణులు చెబుతున్నారు.
విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 19%
అమెరికాలో 12 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా వారిలో భారతీయుల సంఖ్య 2,27,199. ఇది మొత్తం విదేశీ విద్యార్థుల్లో 18.83%. గత నాలుగున్నర సంవత్సరాల్లో మన విద్యార్థుల సంఖ్య రెట్టింపయింది. 2014 ఏప్రిల్‌లో 1.13 లక్షలు మాత్రమే ఉండగా.. ఇప్పుడది 2.27 లక్షలకు పెరిగింది. భారతీయ విద్యార్థుల్లో 67% బాలురు, 33% బాలికలున్నారు. 77.6% మాస్టర్స్ డిగ్రీ (పీజీ), 9.9% బ్యాచిలర్స్ (డిగ్రీ), 9.6% పీహెచ్డీ వారున్నారు. గత ఏడాది (2017 డిసెంబరు నాటికి) 2,12,288 మంది ఉండగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆ సంఖ్య 2,27,199కి పెరిగింది. అంటే 14,911 మంది అధికం. మొత్తం 6.6% వ ద్ధి నమోదైంది. ‘గత ఏడాది వీసాల జారీ కఠినతరం చేశారు. ఈ ఏడాది కొంత సులభంగానే ఇస్తున్నట్లు గమనించాం’ అని వరల్డ్‌వైడ్ కన్సల్టెన్సీ సంస్థ ఎండీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ‘గతంలో వెళ్లిన వారు కూడా అక్కడి విద్యార్థుల కిందకే వస్తారు కాబట్టి మొత్తం సంఖ్య తగ్గకున్నా పెరుగుదల శాతం మందగించింది’ అని గ్లోబల్ ట్రీ కన్సల్టెన్సీ సంచాలకుడు సుభాకర్ అభిప్రాయపడ్డారు.
85% స్టెమ్ కోర్సుల్లోనే..
అక్కడ మొత్తం భారతీయ విద్యార్థుల్లో 1,93,274 మంది (85%) సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) కోర్సుల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు. వారిలో 69.8% బాలురు ఉండగా.. 30.2% బాలికలున్నారు. మొత్తం స్టెమ్ విద్యార్థుల్లో 83.1% ఎంఎస్(పీజీ) చేసేవారే.













