భారతీయులకు ట్రాన్సిట్ వీసా అవసరం లేదు
భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన ప్రయాణికులకు ఇక మీదట ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదని ఫ్రాన్స్ వెల్లడించింది. తమ దేశం నుంచి ప్రయాణించే సమయంలో ఈ వీసా ఇక అవసరం ఉండబోదని తెలిపింది. 2018 జులై 23 నుంచి భారత పాస్‌పోర్ట్ కలిగిన వారికి ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా(ఏటీవీ) అవసరం లేదు. ఈ విషయం వెల్లడించడం సంతోషంగా ఉంది. ఫ్రాన్స్‌లోని అన్ని విమానాశ్రయాలలోని అంతర్జాతీయ జోన్ నుంచి వెళ్లేప్పుడు ఈ వీసా అవసరం ఉండదు అని భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జైగర్ల్ గత వారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. 26 యూరోపియన్ దేశాలపే కలిసి షెంగెన్ ప్రాంతంగా పిలుస్తారు. ఈ షెంగెన్ ప్రాంతం దాటి బయటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారేందుకు ఎయిర్‌పోర్టు ట్రాన్సిట్ వీసా ఉండాలి. ఈ వీసాను ఏ వీసా అని కూడా అంటారు. షెంగెన్ ప్రాంతం, ఆ ప్రాంతం లోపలికి వెలుపలికి రావడానికి అంతర్జాతీయ ప్రయాణికులకు సరిహద్దు నియమాలు ఉంటాయి. కానీ కేవలం ఆ 26 దేశాల లోపల అంతర్గత సరిహద్దు నిబంధనలు ఉండవు.













