అమెరికాలో భారతీయులు మూడో స్థానంలో
అమెరికాలో నివసించే అక్రమ వలసదారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 7,25,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని, ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఓ సర్వే ద్వారా తెలిసింది. 9 లక్షల మంది అక్రమ వలసదారుల జనాభాతో మెక్సికో, 8 లక్షల మందితో ఎల్.సాల్వడార్ ఈ జాబితాలో తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ లెక్కల ప్రకారం మునుపెన్నడూ లేని సంఖ్యలో డాక్యుమెంట్లు లేని భారతీయ వలసదారులు కాలినడకన అమెరికా సరిహద్దులు దాటుతున్నారు.
2022 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబర్ వరకూ పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించినందుకు రికార్డు స్థాయిలో 96,917 మంది భారతీయులను అరెస్టు చేశారు. 2019-20లో వీరి సంఖ్య 19,883 మాత్రమే. ఇదిలా ఉండగా అమెరికాలో నివసించే అక్రమ వలసదారుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఓ సర్వే ద్వారా తెలిసింది. 2007లో వీరి సంఖ్య 1.22 కోట్లు ఉండగా 2023 నాటికి 1.05 కోట్లకు తగ్గింది.













