గిన్నిస్‌లో 80 మంది భారతీయులు
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2020 లో 80 మంది భారతీయులకు చోటు దక్కింది. వేలాది కొత్త రికార్డులు, ప్రత్యేక కేటగిరీలు కలిగిన తాజా గిన్నిస్ పుస్తకాన్ని విడుదల చేసినట్లు పెంగ్విన్ రాండ్సమ్ హౌస్ ప్రచురణ సంస్థ తెలిపింది. అన్ని వయసుల వారికి విజ్ఞానంతో పాటు వినోదం కలిగించేలా దీన్ని తీర్చిదిద్దినట్లు వెల్లడించింది. దీంట్లో భారతీయులకు సంబంధించి 80 అంశాలు ఉన్నట్లు వివరించింది. ప్రపంచంలోనే పొడవైన కురులున్న యువతిగా నీలాన్షి పటేల్ (16) గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఆమె జుట్టు పొడవు 5.7 అడుగులు. నాగపూర్‌కు చెందిన జ్యోతి అమాజి ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా (24.7 అంగుళాలు) రికార్డు కెక్కారు. పొడవైన చేతివేలి గోర్లు (909.6 సెం.మీ) కలిగిన వ్యక్తిగా పుణెకు చెందిన శ్రీధర్ నిలిచారు.
భారత్‌లో ప్రజా రవాణా ద్వారా అత్యంత దూరం (29,119 కి.మీ) ప్రయాణించిన వారిగా జ్యోత్స్నా మిశ్రా, దుర్గా చరణ్ రికార్డుకెక్కారు. 736 రకాల కాగితం కప్పులు సేకరించిన వ్యక్తిగా తమిళనాడుకు చెందిన శంకరనారాయణన్ నిలిచారు. పది బార్స్ కిందుగా అత్యంత వేగంగా స్కేట్ చేసిన (2.06 సెకండ్లు) ఘనతను నవీన్ కుమార్ సాధించారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.













