వర్క్ పర్మిట్ కోసం కోర్టుకు…
యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్విసెస్పై అమెరికాలో ఉంటున్న భారతీయ మహిళ దావా వేశారు. యూఎస్సీఐఎస్ చేస్తున్న జాప్యం కారణంగా తాను ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని లాసూట్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. రంజితా సుబ్రహ్మణ్య తన భర్త వినోద్ సింహాతో కలిసి అమెరికాలోని ఒహియోలో ఉంటున్నారు. హెచ్1 బీ వీసాతో వినోద్ సింహా అక్కడ ఓ సంస్థలో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే రంజితా సుబ్రహ్మణ్య హెచ్ 4 వీసా పొంది, ఓ కంపెనీలో పని చేస్తున్నారు. కాగా.. తన హెచ్ 4 హోదా, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ)ని పొడిగించాలని కోరుతూ రంజితా సుబ్రహ్మణ్యం ఏప్రిల్లో దరఖాస్తు చేశారు. అమె చేసిన దరఖాస్తును యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్విసెస్.. ఏప్రిల్ 7న ఆమోదించింది. కానీ ఇప్పటి వరకు ఆమెకు కొత్త వర్క్ పర్మిట్ కార్డును జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆమె కోర్టుకెక్కారు. గతంలో తనకు మంజూరు చేసిన వర్క్ పర్మిట్ గడువు జూన్ 7న ముగిసిందన్నారు. ఆగస్ట్ 9 లోపు తనకు కొత్త వర్క్ పర్మిట్ కార్డును మంజూరు కాకపోతే.. తాను ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని ఒహియోలోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన లాసూట్లో రంజితా పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు వర్క్ పర్మిట్ జారీ చేసే విధంగా యూఎస్సీఐఎస్ను ఆదేశించాలని కోర్టును ఆమె కోరారు.













