ఇమేజిన్ కప్ వరల్డ్ పోటీలో రన్నరప్ గా భారత బృందం
మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇమేజీన్ కప్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భారత్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు రెండో స్థానంలో (ఫస్ట్ రన్నరప్‌గా) నిలిచారు. వీరు స్మార్ట్ ఆటోమేటెడ్ కాలుష్య నిరోధక, ఔషధ బట్వాడా మాస్క్‌ను తయారు చేశారు. ఇలాంటి సాధనాన్ని రూపొందించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. అకాశ్, వాసు కౌకిశ్, భరత్ సుందల్లు ఈ ఘనత సాధించారు. ఆస్థమా, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలున్న రోగులకు ఉపయోగపడే సేలి అనే సాధనాన్ని వీరు రూపొందించారు. ఫిబ్రవరిలో సిడ్నీలో జరిగిన ఆసియా ప్రాంతీయ తుది పోటీలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. మొదటి బహుమతిని అమెరికాకు చెందిన టీమ్ ఈజీగ్లూకోజ్ గెల్చుకుంది. ఈ బృందానికి లక్ష డాలర్ల బహుమతి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల నుంచి మార్గనిర్దేశ ఉపన్యాసం లభిస్తుంది. ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన భారత బృందానికి సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు, 40 వేల డాలర్లు దక్కుతాయి.













