అమెరికాలో మృత్వువుతో పోరాడుతున్న భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని అక్కడి పిడుగుపాటుకు గురై మృత్యువుతో పోరాడుతోంది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ (యూహెచ్)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు (25) జులై మొదటివారంలో తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులో ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో పిడుగుపాటుకు గురైంది. ఈ ఘటనలో ఆమె మెదడు దెబ్బతిన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సుదీర్ఘకాలం చాలా కీలకమైన వైద్యచికిత్స అందించాల్సి ఉంటుందని సుశ్రూణ్య బంధువు సురేంద్రకుమార్ కొత్త తెలిపారు. ఈ మేరకు ఆమె వైద్య ఖర్చుల కోసం, అలాగే కుటుంబ సభ్యులను పిలిచేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఆన్లైన్లో గోఫండ్మీ ని ఏర్పాటు చేశారు. సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైన వెంటనే కొలనులో పడిపోయారని, ఆ సమయంలో 20 నిమిషాలపాటు గుండె లయ తప్పడంతో మెదడు దెబ్బతిన్నట్లు సురేంద్ర తెలిపారు. తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయారు.













