పార్కింగ్ సమస్యలకు తెలుగు విద్యార్థి పరిష్కారం!
పార్కింగ్ సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించే దిశగా అమెరికాలోని ఓ తెలుగు విద్యార్థి ముందడుగు వేశాడు. ఖాళీ జాగాను గుర్తించే క్రమసూత్ర పద్ధతి(అల్లోరిథం)ని రూపొందించాడు. పార్కింగ్ ప్రదేశంలోకి ప్రవేశించిన వెంటనే ఖాళీ జాగా ఎక్కడుందో గుర్తించగలగడమే సమస్యకు పరిష్కారమని సాయి ప్రతిపాదించాడు. అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయంలో చదువుతున్న మెట్టుపల్లి సాయి నిఖిల్ రెడ్డి తన ప్రతిపాదనకు గాను 2018 సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్‌హౌస్ పోటీల్లో రెండో బహుమతిని సాధించాడు. డ్రైవర్లు ఖాళీగా ఉండే పార్కింగ్ ప్రదేశంలోకి నేరుగా వెళ్లిపోయేలా ఇన్స్టాపార్క్ అనే మొబైల్ యాప్‌ను సాయి అభివృద్ధి చేస్తున్నాడు. ఇందులో ఫోన్ జీపీఎస్ ద్వారా పార్కింగ్ ప్రదేశంలోని ఖాళీ జాగాలు, కార్లతో నిండిపోయిన ప్రదేశాల గ్రిడ్ లేఅవుట్ ప్రత్యక్షమవుతుంది. సాయి చేస్తున్న కసరత్తుకు వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వినీతా మెనన్ బిగ్‌డేటా అనలిటిక్స్ ల్యాబ్ ద్వారా సహకారం అందిస్తున్నారు. సాయి పిలానీలోని బిట్స్‌లో ఇంజినీరింగ్ చదివాడు.













