రోటీలపై కరోనా శుభ్రత మెసేజ్
కరోనా వ్యాధి సోకకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలాముఖ్యమని పలువురు పరిపరివిధాలుగా చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి సామాజిక సంస్థల దాకా అందరూ ఇదేమాటను చెబుతుంటారు. సినిమావాళ్ళు దీనిని తమదైన రీతిలో పాటల ద్వారా వినిపిస్తే, ఆర్టిస్ట్‌లు తమ డైలాగ్‌ల రూపంలో తెలియజేశారు. కాని దుబాయ్‌లోని ఎన్నారైలు తనదైన శైలిలో ఈ ప్రచారాన్ని చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయనకుచెందిన ఓ ఇండియన్ రెస్టారెంట్ రోటీల ద్వారా కరోనా శుభ్రత మెసేజ్ ను అందిస్తోంది. హోమ్ డెలివరీ చేసే రోటీలపై ‘చేతులు కడుక్కున్నారా’ అనే అచ్చు వేసి ప్రజలకు మెసేజ్ పంపిస్తున్నారు. దుబాయిలోని జెమేరా లేక్స్ టవర్స్, ఔద్ మేథాలలో సాగర్ రత్నా అనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది. పీయుష్ మాలూ, పూజా మాలూ, ఆశిష్ మారు అనే ముగ్గురు భారతీయులు ఈ రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. ఒక స్టీల్ ప్లేట్ ద్వారా రోటీలపై ‘చేతులు కడుక్కున్నారా.. సాగర్ రత్నా’ అనే అచ్చు వేస్తున్నట్టు పూజా తెలిపారు.
ఈ స్టీల్ ప్లేట్, ముద్ర కూడా దుబాయి మున్సిపాలిటీ స్టాండర్డస్ కింద ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ముద్ర వేసిన తరువాత రోటీని ఓవెన్లో పెట్టడం వల్ల ముద్ర అలాగే ఉండిపోతుందన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నట్టు పీయూష్ చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తమ కస్టమర్లకు రోటీలను తినే ముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలనే విషయం గుర్తొస్తుందని ఆయన తెలిపారు. భారత వంటకాలను చేతులతోనే తింటారు కాబట్టి.. చేతులను శుభ్రపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.













