భారత సంతతి శాస్త్రవేత్త మృతి
భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైరాలజిస్ట్ కరోనా లక్షణాలతో దక్షిణాఫ్రికాలో మరణించారు. వాక్సిన్ శాస్త్రవేత్త, హెచ్ఐవీపై పరిశోధకురాలు ప్రొఫెసర్ గీతా రామ్జీ (50) దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. తాజాగా ఆమె కరోనా వైరస్ కారణంగా కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు. గతవారం క్రితమే గీతా రామ్జీ లండన్ నుంచి దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అనంతరం అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కొవిడ్-19 సంబంధిత లక్షణాలను చికిత్స పొందుతూ గీతా రామ్జీ మరణించారని దక్షిణాఫ్రికా వైద్య పరిశోధన మండలి (ఎస్ఏఎంఆర్సీ) ప్రకటనలో పేర్కొంది. గీతా రామ్జీ అకస్మాత్తు మరణం తమను ఎంతగానో కలచివేసిందని ఎస్ఏఎంఆర్సీ అధ్యక్షుడు గ్లెండా గ్రే పేర్కొన్నారు. ప్రస్తుతం గీతా రామ్జీ దక్షిణాఫ్రికా వైద్యపరిశోధన మండలి (ఎస్ఏఎంఆర్సీ) లోని క్లినికల్ ట్రయల్స్ విభాగంలో ముఖ్య పరిశోధకురాలిగా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా హెచ్ఐవీ నిర్మూలనపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలకుగాను ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతోపాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.













