అమెరికాలో భారత సంతతి వైద్యుడికి ఘనత
అమెరికాలోని భారత సంతతి వైద్యుడి నేతృత్వంలో వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. కరోనాతో బాధపడుతున్న రోగికి రెండు ఊపిరితిత్తులను విజయవంతంగా మార్చారు. షికాగోలోని నార్త్వెస్ట్రన్ మెడిసిన్ ఆస్పత్రిలో ఉన్న ఓయువతి (20)కి కరోనా తీవ్రస్థాయిలో ఉంది. వైరస్ ప్రభావంతో ఆమె రెండు ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఈ నేపథ్యంలో.. ఆమెను కాపాడేందుకు ఊపిరితిత్తుల్ని మార్చాలని వైద్యులు నిర్ణయించారు. తొరాసిక్ సర్జరీ నిపుణులైన డా. అంకిత్ భరత్ నేతృతంలో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. కరోనా రోగుల్లో అవయవ మార్పిడి అనేది చాలా సవాళ్లతో కూడుకున్నదే అయినప్పటికీ అదిసాధ్యమేనని భారత్ తెలిపారు. బతికేందుకు వేరే మార్గంలేని రోగులకు సర్జరీ నిర్వహించి ప్రాణాలు నిలబెట్టవచ్చని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులకు ఆయన సలహా ఇచ్చారు. అవయవ మార్పిడి దాతల వివరాలు సేకరించే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా రోగికి ఊపిరితిత్తులు అందాయని భరత్ వెల్లడించారు. కరోనా రోగికి ఈ తరహా సర్జరీ నిర్వహించడం అమెరికాలో ఇదే తొలిసారి కాగా.. ప్రపంచంలోనే అత్యంత అతి తక్కువ ఆపరేషన్లలో ఇదీ ఒకటి కావడం గమనార్హం.













