ఎన్నారై డాక్టర్ కు అమెరికన్ ల వందనం
అమెరికాలోని ఒక పట్టణంలో కోవిడ్ 19 బాధితులకు చికిత్స చేసిన మన భారతీయ వైద్యురాలికి అక్కడి స్థానికులు మరచిపోలేని అభినందనలు తెలిపారు. న్యూయార్క్ – బోస్టన్ నగరాల మధ్యన సౌత్ విండ్సర్ పట్టణంలో ఉన్న భారత సంతతికి చెందిన డాక్టర్ ఉమ మధుసూదన్ చేసిన సేవలకు అమెరికన్లు ముగ్దులయ్యారు. సాధారణంగా అమెరికన్ కంట్రీ సైడ్ వైద్యులకు పెద్దఎత్తున గౌరవ మర్యాదలు ఇచ్చే అమెరికన్లు కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలందించినందుకు ఆమెకు వందలాది అమెరికన్లు రకరకాల వాహనాల్లో వచ్చి వ్యక్తిగతంగా గౌరవవందనం సమర్పించుకుంటూ ధన్యవాదాలు తెలియజేశారు. అధికారులు కూడా ఆమె ఇంటిముందు నుంచి ప్రభుత్వ వాహనాలతో పరేడ్ నిర్వహించారు. ఆమెను అభినందించే వాహన శ్రేణి ఎంతగా బారులు తీరిందో చూస్తో ఆమెపై అమెరికన్లకు ఎంత గౌరవమర్యాదలు కలిగాయో అర్థమవుతుంది. మైసూరు నుంచి వచ్చిన ఆమె ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు వారు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ ఆమె సేవలకు సెల్యూట్ చేశారు. ఇలా అగ్రరాజ్యంలో భారత వైద్యురాలికి అరుదైన గౌరవం దక్కింది.













