న్యూయార్క్ లో కరోనాతో తెలుగు జర్నలిస్ట్ మృతి
న్యూయార్క్ నగర్లో భారత సంతతి జర్నలిస్ట్ ఒకరు కోవిడ్ 19 వ్యాధి తీవ్రతతో చనిపోయారు. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో కరెస్పాండెంట్‌గా పని చేస్తున్న బ్రహ్మ కంచిభొట్ల(66) కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయారని ఆయన కుమారుడు తెలిపారు. తొమ్మిది రోజులపాటు ఈ మహమ్మారితో పోరాడిన బ్రహ్మ చివరకు ప్రాణాలొదిలారు. యూఎస్‌లో 28 ఏళ్లుగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్న ఆయన చివరకు కరోనా కాటుకు బలి అయ్యారు.
బ్రహ్మ కుమారుడు సుడామా కంచిభొట్ల మాట్లాడుతూ ప్రస్తుతం న్యూయార్క్ లో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా తండ్రి ఆఖరి చూపుకు నోచుకుంటామో లేదో అని వాపోయాడు. తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇస్తారనే నమ్మకం కూడా లేదన్నాడు. మార్చి 23న తొలిసారి బ్రహ్మకు కరోనా లక్షణాలు బయటపడ్డాయని, దాంతో ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉన్నారని తెలిపాడు. కానీ, మార్చి 28 నాటికి తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో అదే రోజు లాంగ్ ఐస్లాండ్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించామని సుడామా తెలిపాడు. మార్చి 31న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటిలేటర్‌పైకి మార్చారని, ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు చెప్పాడు. మృతుడు బ్రహ్మకు కుమారుడు సుడామాతో పాటు కూతురు సుజానా, భార్య అంజనా ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు తెలుగు సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆటా, తానా నాయకులు సంతాపం తెలిపినవారిలో ఉన్నారు.
తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు కూడా బ్రహ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. 1992లో ఆటా ఎఫ్ఐఎ తో కలిసి నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మొదటిసారిగా రాష్ట్రం నుంచి హాజరైన జర్నలిస్టుల్లో బ్రహ్మ కూడా ఉన్నారని, అప్పటి నుంచి ఆయనతో మంచి స్నేహం ఉండేదని చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ఆయన మృతిపట్ల అమెరికా మంచి జర్నలిస్ట్ ని కోల్పోయిందని చెప్పారు.













