భారతీయులను నేరస్థుల్లా చూస్తున్నారు
అమెరికాలో భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నేరస్థుల్లా చూస్తోందని న్యాయ సేవల సంస్థల వలంటీర్లు చెబుతున్నారు. కారాగారాల్లో సిక్కుల తలపాగాలనూ తీసేసుకుంటున్నారని వివరిస్తున్నారు. అక్కడ 18 ఏళ్ల యువకులు మొదలుకొని అందరికీ ఖైదీల వస్త్రాలు వేసుకొమ్మంటున్నారు. వారిని నేరస్థుల్లా పరిగణిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. వాళ్తు ఏ తప్పూ చేయలేదు. ఆశ్రయం కోరుతూ సరిహద్దులను దాటినందుకే ఈ శిక్షా? అంటూ వలంటీర్ నవనీత్ కౌర్ ప్రశ్నించారు.
గత కొన్నివారాల్లో అమె 52 మందికిపైగా భారతీయులను జైళ్లలో కలిశారు. స్వచ్ఛంద న్యాయసేవల సంస్థ ఇన్నోవేషన్ లా ల్యాబ్ తరపున వలంటీర్‌గా ఆమె పనిచేస్తున్నారు. జైళ్లలో గడుపుతున్నవారికి న్యాయ సేవలను అందిస్తున్నారు. అక్కడ భారతీయుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షేరిడాన్ జైలులో 52 మంది ఉన్నారు. వారిలో ఎక్కువ మంది పంజాబీలే. వారి చేతికి సంకెళ్లు బిగించివున్నాయి. అలాగే వారు భోజనం చేస్తున్నారు. కరుడుగట్టిన నేరస్థులనూ ఇలా చూడరేమో. రోజులో 22 గంటలపాటు వారిని జైలు గదిలోనే బంధిస్తున్నారు అని ఆమె వివరణ ఇచ్చారు.













