డీసీ సర్క్యూట్ కోర్టు జడ్జిగా భారతీయురాలు!
ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమీ రావ్‌కు అమెరికాలో కీలక పదవి లభించనుంది. శక్తిమంతమైన డి.సి (డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా) సర్క్యూట్ అప్పీళ్ల న్యాయస్థానం న్యాయమూర్తిగా ఆమెను దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. శ్వేతసౌధంలోని చరిత్రాత్మక రూజ్వెల్ట్ రూమ్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు.
అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత శక్తిమంతమైన న్యాయస్థానంగా డి.సి.సర్క్యూట్‌ను పరిగణిస్తారు. 45 ఏళ్ల నియోమీ రావ్ ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో సమాచార, క్రమబద్ధీకరణ వ్యవహారాల కార్యాలయం(ఓఐఆర్ఏ) పాలనాధికారిగా ఉన్నారు. డి.సి.సర్క్యూట్‌కు నియోమీ నామినేషన్‌ను సెనేట్ ఆమోదిస్తే, శ్రీనివాసన్ తర్వాత ఆ కోర్టులో నియమితులైన రెండో భారతీయ అమెరికన్ న్యాయమూర్తిగా ఆమె చరిత్ర పుటల్లోకెక్కుతారు.













