ట్రంప్ కోసం భారతీయుల పూజలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ త్వరగా కరోనా బారి నుంచి కోలుకోవాలని భారత అమెరికన్లు మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రి బయట ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ అమెరికన్లు మంత్రాలు చదవడంతో పాటు శంఖం కూడా ఊదారు. ‘ట్రంప్‌కు మద్దతుగా వాల్టర్ రీడ్ ఆస్పత్రి వద్దకు వచ్చిన భారతీయ అమెరికన్ సమాజానికి ధన్యవాదాలు. కరోనాను జయించి ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుందాం. డెమొక్రా 47 ఏళ్లలో చేసిన దానిని ట్రంప్ కేవలం 4 ఏళ్లలో చేసి చూపించారు.’’ అని కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ 11 కాంగ్రెస్ అభ్యర్థి నిషా శర్మ అన్నారు. అలాగే హిందూ అమెరికన్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రేయర్ మీటింగ్‌లో కూడా భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు ఆయన త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని, మరోసారి ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠం అధిరోహించాలని దేవుడ్ని ప్రార్థించారు. ఆస్పత్రి వద్దకు ఇండో-అమెరిక్లతో పాటు అమెరికన్ పౌరులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ట్రంప్ 2020 ఫొటోలు, అమెరికా జాతీయ జెండాలను చేతబట్టి ట్రంప్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. కాగా, తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, కార్యకర్తలకు ఆదివారం ఓ వీడియో ద్వారా ట్రంప్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని, కరోనాను జయించి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని తెలిపారు.













