భారత్, అమెరికా మధ్య ఐటీ కీలకం : హర్ష్ వర్ధన్ శ్రింగ్లా
భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మెరుగుపరచడంలో భారత ఐటీ పరిశ్రమ కీలక భాగస్వామిగా ఉందని అమెరికాలో భారత రాయబారి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా తెలిపారు. మన ఐటీ పరిశ్రమ అమెరికా కంపెనీల ప్రపంచవ్యాప్త కార్యకలాపాల పోటీతత్వాన్ని పెంచడానికే కాకుండా అమెరికాలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలను కల్పిస్తోందన్నారు. అమెరికాలో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, హెచ్ 1బీ వీసాలు అనే అంశంపై జరిగిన చర్చలో హర్ష్ వర్ధన్ పాల్గొన్నారు. అమెరికాలో అనేక రాష్ట్రాల్లో భారత ఐటీ కంపెనీలు అనేక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయన్నారు. ఒక అంచనా ప్రకారం భారత ఐటీ కంపెలు అమెరికాలో 5,000 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. కాగా అమెరికాలో ప్రస్తుతం హైటెక్ రంగంలో 24 లక్షల మంది కొరత ఉందని హర్ష్ వర్ధన్ తెలిపారు. ఈ రంగంలో తగిన అనుభవం, నైపుణ్యాలు కలిగిన వారి కొరత చాలా ఎక్కువగా ఉందన్నారు.













