భారతీయులదే అగ్రస్థానం
సైన్స్, ఇంజినీరింగ్ పట్టభద్రులను తయారుచేయడంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. యాన్యువల్ సన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇండికేటర్స్ పేరుతో అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వెల్లడించిన తాజా నివేదిక ఈ విషయాన్ని సృష్టం చేసింది. 2014లో సైన్స్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రపంచవ్యాప్తంగా బ్యాచిలర్ పట్టాలు పొందినవారిలో, నాటుగింట ఒక వంతు మంది భారతీయులేనని పేర్కొంది. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మంది సైన్స్, ఇంజినీరింగ్ల్లో బ్యాచిలర్ కోర్సులు పూర్తిచేశారని, వీరిలో భారతీయులు 25శాతం, చైనీయులు 22శాతం, ఐరోపా సమాఖ్య వారు 12శాతం, అమెరికన్లు 10శాతం ఉన్నారని వెల్లడించింది. పరిశోధక (డాక్టోరల్) డిగ్రీల్లో మాత్రం అమెరికానే ముందంజలో ఉంది.
2014లో ఆ దేశంలో 40,000 మంది ఈ పట్టాలు అందుకున్నారు. వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా (34,000), రష్యా (15,000), బ్రిటన్ (14,00), భారత్ (13,000) ఉన్నాయి. ఇటు పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కి సంబంధించిన వ్యయం చేయడంలోనూ అమెరికాదే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్త వ్యయంలో 26 శాతం వాటా అమెరికాదే. 21 శాతం వాటాతో చైనా రెండో స్థానంలో ఉంది. మిగతా దేశాలు, ముఖ్యంగా చైనా గణనీయమైన ప్రగతిని సాధిస్తుండటంతో శాస్త్ర సాంకేతిక కార్యకలాపాల్లో అమెరికా వాటా తగ్గిపోతోందని ఈ నివేదిక వెల్లడించింది.













