భారత్ కృషి కీలకం : బిల్ గేట్స్
భారత్‌లో జరుగుతున్న పరిశోధనలు, భారీ స్థాయిలో టీకా తయారీ ప్రయత్నాలు కొవిడ్ 19 నివారణలో ఎంతో కీలకమైనవని మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకులు, భూరి విరాళాల దాత బిల్ గేట్స్ అన్నారు. గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. టీకా తయారీ, కరోనా సోకినట్లు నిర్ధారించే పక్రియలు క్లిష్టమైనవని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొవిడ్‌కు టీకా తయారుచేసే యత్నాల్లో నిమగ్నమయ్యారని, ఈ పెను సవాల్‌ను ఎదుర్కోవటానికి వారంతా పరస్పరం సహకరించుకుంటున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఔషద కంపెనీలు కూడా ఒకదానికొకటి చేయూతను అందించుకుంటున్నాయని అన్నారు. మరింత సులభంగా కరోనాను నిర్ధారించే కిట్లు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.













