మరో సిలికాన్ వ్యాలీని సృష్టించే దమ్ముంది
ఐదేండ్లలో మరో సిలికాన్ వ్యాలీని సృష్టించే సత్తా భారత్‌కు ఉందని ప్రపంచ బ్యాంక్ ధీమా వ్యక్తం చేసింది. అయితే ఇందుకు మరిన్ని నూతన ఆవిష్కరణల అవసరం ఉందన్నది. ఈ వ్యవస్థ మరింతగా పరిణతి చెందాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త ఆవిష్కరణలపై నివేదిక విడుదల సందర్భంగా ప్రపంచ బ్యాంక్ భారతీయ అధిపతి జునైద్ కమల్ మాట్లాడుతూ ప్రపంచం మారుతున్న వేళ వచ్చే ఐదేండ్లలో భారత్‌లోనూ ఓ సిలికాన్ వ్యాలీని రూపొందించే సామర్థ్యం మనకూ ఉన్నదని నేను భావిస్తున్నాను అన్నారు. దిగువ మధ్యశ్రేణి ఆదాయ దేశం నుంచి అధిక ఆదాయ దేశంగా భారత్ ఎదుగాలన్న తపనే ఈ కలకు ముందడుగని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో ఆయా రంగాల్లోని సంస్థలు ఉన్నచోటనే ఉంటున్నాయని, అయితే పరిమాణం, సామర్థ్యం ఆవిష్కరణలు పెరిగితే మరో సిలికాన్ వ్యాలీ త్వరలోనే భారత్‌లోనూ ఆవిష్కృతమవుతుందన్నారు. పెట్టుబడుల్లో పరిశోధనలకున్న ప్రాధానత్యత తక్కువగా ఉంటున్నది. అవసరమైన సాంకేతికతను దిగుమతి చేసుకోవడానికి, నైపుణ్యం కలిగిన పనివారిని, ఇంజినీర్లను నియమించుకోవడానికి, నూతన సంస్థాగత మెళకువలను అందిపుచ్చుకోవడానికి సంస్థలు ఆసక్తి చూపడం లేదు. దీంతో పెట్టుబడులు కరువయ్యాయి అని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొన్నది.













