భారత్‌కు ఆ సత్తా ఉంది : బిల్ గేట్స్
రానున్న పదేళ్లలో ఆర్థికంగా శరవేగంతో అభివృద్ధి చెందగల సత్తా భారత్‌కు ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలితంగా ఆరోగ్య, విద్యారంగాల్లో విశేషంగా పెట్టుబడులు పెట్టే అవకాశం భారత్‌కు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. భారీ ఖర్చు అవసరం లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను భారత్‌లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అత్యాధునిక డిజిటల్ పరికరాలు, ఆ దిశగా ప్రైవేటు రంగంలో మరిన్ని ఆవిష్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. పోలియో వ్యాధి నిర్మూలన భారత వైద్య వ్యవస్థలో అతిపెద్ద విజయమంటూ ప్రశంసించారు.
టీకా తయారీ రంగంలో భారత్‌ను అగ్రగామిగా పేర్కొన వచ్చన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన బిల్‌గేట్స్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడింంచారు. వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో ఆవిష్కరణలకు సంబంధించిన తాజా వివరాలు తెలుసుకునేందుకు కొన్ని ప్రైవేటు సంస్థల ప్రతినిధులను కలవనున్నట్లు చెప్పారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ పౌండేషన్ భారత్‌లో పేదల కోసం వ్యవసాయ, ఆరోగ్యసంరక్షణ, పారిశుద్ధ్యం, వ్యవసాయ, ఆర్థిక సేవా రంగాల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న విషయం గమనార్హం. ఆధార్ గుర్తింపు సంఖ్య విధానాన్ని బిల్‌గేట్స్ ప్రశంసించారు.













