మా దేశంలో ఉగ్రవాదులున్నారు : ఇమ్రాన్
తమ దేశంలో ఇంకా 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బహిరంగంగా ప్రకటించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించారు. గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్లే వాటి కార్యకలాపాలు హెచ్చుమీరాయన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన యునైటెడ్ స్టేట్స్ పీస్ ఇన్స్టిట్యూట్లో ప్రసంగిస్తూ ఈ విషయాలు బయటపెట్టారు. ముష్కరులంతా ఆఫ్టానిస్థాన్, కశ్మీర్ ప్రాంతాల్లో శిక్షణ పొంది దాడులకు పాల్పడుతున్నారన్నారు. 2014లో తాలిబన్లు చేసిన దాడిలో దాదాపు 150 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినప్పుడే.. దేశంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను ఏమాత్రం అనుమతించొద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు అన్ని పార్టీల కలిసి కార్యాచరణ రూపొందించాయన్నారు. కానీ చిత్తుశుద్ది లోపించిన గత ప్రభుత్వాలు దాన్ని అమలు చేయలేకపోయాయని తెలిపారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉగ్రసంస్థల నిర్వీర్యం కోసం చర్యలు తీసుకుంటోందని అన్నారు.













