ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో 46వ ఇండియా డే వేడుకలు
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్త్ టెక్సాస్లోని భారత అసోసియేషన్ 46వ భారత దినోత్సవాన్ని నిర్వహించుకుంది. USAలోని టెక్సాస్లోని రిచర్డ్సన్లోని ఎయిస్మన్ సెంటర్లో ఈ వేడుక నిర్వహించింది. తొలుత భారత జాతీయ గీతంతో పాటు అమెరికన్ జాతీయ గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని వర్ణించే కళలు, నృత్య రూపాలకు సంబంధించి 65 అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. వేలాదిమంది ఎన్ఆర్ఐల మధ్య 1000 మందికి పైగా పిల్లలు, పెద్దలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అబ్బురపరిచాయి. అనంతరం బోర్డు సభ్యులు ప్రదర్శనకారులకు ట్రోఫీలు అందించి సత్కరించారు.
ఈ సందర్భంగా ఐఏఎన్టీ ప్రెసిడెంట్ దినేష్ హుడా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు బోర్డు సభ్యులు, వాలంటీర్లు, ప్రదర్శనకారులకు ధన్యవాదాలు తెలిపారు. 2023 సంవత్సరంలో ఐఏఎన్టీకి సహకారం అందించినందుకు స్పాన్సర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. అలాగే ఐఏఎన్టీని మరింత వృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చివరికగా గత 3 నెలలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఐఏఎన్టీ ట్రస్టీ బోర్డ్ చైర్పర్సన్ ఇందు రెడ్డి మందడి చేసిన కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలోహ్యూస్టన్లోని భారత కాన్సుల్ జనరల్ అసీమ్ ఆర్.మహాజన్, టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి సల్మాన్ భోజానీ, మాట్ షాహీన్, ఎంజీ చెన్ బటన్, అనా మేరీ రామోస్, బ్రెన్టెన్ మెడోస్, సిటీ ఆఫ్ రిచర్డ్సన్ డిప్యూటీ మేయర్ పాల్ వాకర్, మేయర్ ప్రొటెర్మ్ జానెట్ , కౌన్సిల్ సభ్యులు జో కోర్కోరన్, కెన్ హుచెన్రైడర్, అరేఫిన్ షంసుల్, సిటీ ఆఫ్ గార్లాండ్ మేయర్ స్కాట్ లెమే, సిటీ ఆఫ్ ఫ్రిస్కో కౌన్సిల్ మెంబర్ లారా రమ్మెల్, ఐఎస్డీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గోపాల్ పోనాంగి, సిటీ ఆఫ్ లిటిల్ ఎల్మ్ కౌన్సిల్ సభ్యుడు టోనీ సింగ్, సిటీ ఆఫ్ ఇర్వింగ్ మేయర్ ప్రోటెర్ అల్ జపాంటా , సిటీ ఆఫ్ ప్లానో మేయర్ జాన్ మున్స్ మరియు టెక్సాస్ యొక్క 32వ జిల్లా కాంగ్రెస్ సభ్యుడు కొలిన్ ఆల్రెడ్ తదితరులు పాల్గొన్నారు.













