Donald Trump: విదేశీ విద్యార్థులకు స్వాగతం.. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ సంచలన ప్రకటన చేశారు. విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు (US President Donald Trump). వారు రావడం అమెరికాలోని వ్యాపారాలకు మంచిదేనని వ్యాఖ్యానించారు. దీనివల్ల దేశ ఉన్నత విద్యావ్యవస్థకు మద్దతుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేశారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థుల సంఖ్యను సగానికి తగ్గించకూడదు. దానివల్ల మన విశ్వవిద్యాలయ, కళాశాల వ్యవస్థ నాశనం అవుతుంది. నేను అలా జరగనివ్వను. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు ఉండటం మంచిది. నేను ప్రపంచంతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను’’ అని ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. అమెరికాకు వచ్చేవారిని సగానికి తగ్గిస్తే.. అది కొంతమందికి సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. అయితే అమెరికాలో సగం కళాశాలలకు వ్యాపారం లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. దేశీయ విద్యార్థులతో పోలిస్తే.. విదేశాల నుంచి వచ్చేవారు రెట్టింపు కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే ట్రంప్.. విద్యార్థి లోకాన్ని హడలెత్తిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అయితే సింహస్వప్నంలా మారారు. వీసాలు సహా అన్ని ప్రక్రియలను కట్టుదిట్టం చేస్తూ.. విద్యార్థి లోకాన్ని అతలాకుతలం చేశారు ట్రంప్. దీంతో సగానికి పైగా దేశాల నుంచి అమెరికా వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. ఆ ఆశలు వదిలేసుకున్నారు. ఇక్కడ కాదని, యూరప్ వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో అమెరికాలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చాలా వరకూ సీట్లు ఖాళీగా ఉంటున్నట్లు సమాచారం. ఆయా వర్సిటీలు ఎంతగా చెబుతున్నా.. అక్కడ ఉన్న విద్యార్థులు కూడా, అమెరికా వెళ్లాలనుకుంటున్న ఔత్సాహిక విద్యార్థులకు వద్దనే చెబుతున్నారు. పరిస్థితి అంత అగమ్య గోచరంగా తయారైంది.
ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. విద్యార్థిలోకానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విదేశాల నుంచి వచ్చే విద్యార్థులను తాము వద్దనుకోవడం లేదన్నారు ట్రంప్. వారి రాకవల్ల అమెరికాకు ఆదాయం వస్తోందని గుర్తు చేశారు. అయితే ట్రంప్ మాటలకు, చేతలకు ఉన్న తేడాను బట్టి.. అధ్యక్షుడి మాటలను విద్యార్థులు విశ్వసించే పరిస్థితి లేదంటున్నారు విద్యారంగ నిపుణులు.







