అమెరికాలో తెలంగాణ యువతి అదృశ్యం
తెలంగాణకు చెందిన నితీష కందుల (23) అనే యువతి అమెరికాలో అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారింది. వారం రోజులపుతున్నా, ఆమె ఆచూకీపై కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం అందకపోవటంతో ఆందోళనకు గురవుతున్నారు. నితీష స్వస్థలం నిజామాబాద్ జిల్లా. బాల్యంలోనే తల్లిదండ్రులు దూరమవటంతో నితీష, ఆమె సోదరి అమ్మమ్మ వద్ద పెరిగారు. బీటెక్ పూర్తి చేసిన నితీష ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం రావటంతో హైదరాబాద్‌లో చేరారు. చెల్లిలితోపాటు కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నాక, ఎంఎస్ చదవడం కోసం నితీష అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లారు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఆమె, గత నెల 28న లాస్ఏంజెల్స్ వెళ్లింది. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. నితీష చివరిసారిగా లాస్ ఏంజెల్స్‌లో కనిపించినట్లు యూనివర్సిటీ ఎక్స్‌లో పోస్టు చేసింది. 30వ తేదీన కాలిఫోర్నియా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఆమె గురించి తెలుగువారు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పెడుతూ, నితీష సురక్షితంగా ఇల్లు చేరాలని కోరుకుంటున్నారు.







