అమెరికా కంపెనీలను ఆకర్షిస్తున్న హైదరాబాద్
అమెరికాలోని కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తోందని, పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైన కేంద్రంగా కనిపిస్తోందని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరీన్ బి.హడ్డా అన్నారు. ఇక్కడి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని ప్రశంసించారు. సింక్రోని ఫైనాన్షియల్ కంపెనీ తమ రెండో కార్యాలయాన్ని ఐటీ కారిడార్ నాలెడ్జ్సిటీలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి కేథరీన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైదరాబాద్ నగరంలో అమెరికాకు చెందిన 130 కంపెనీలు ఉన్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు కేవలం వ్యాపారలావాదేవీలపైనే కాకుండా సామాజికి సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషించడం అభినందనీయమని కేథరీన్ అన్నారు. సింక్రోని ఫైనాన్షియల్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఫైజులుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం నూతన కార్యాలయం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, ఇక్కడ ఉద్యోగులకు పనిచేసేందుకు కావాల్సిన వసతులను సమకూర్చినట్లు చెప్పారు. 94 మంది దివ్వాంగులు తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కంపెనీ సామాజిక సేవా కార్యక్రమంలో పేదలకు కంటి శస్త్రచికిత్సలు చేయించేందుకు హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు తమ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.













