అమెరికాలో మరో విపత్తు
అమెరికాను వరుస విపత్తులు వేధిస్తున్నాయి. ప్రస్తుతం హరికేన్ ఇడాలియా ఫ్లోరిడా తీరంవైపు దూసుకొస్తోంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ హరికేన్ ప్రస్తుతం కేటగిరీ-3 తుపానుగా మారింది. కొద్దిగంటల్లో ఇది ఫ్లోరిడా తీరాన్ని తాకనుంది. దాంతో లోతట్టు ప్రాంత ప్రజలను స్థానిక యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ హరికేన్ కారణంగా 120 ఎంపీహెచ్ వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ హరికేన్ ప్రమాదకర తుపానుగా మారడంతో తీరాన్ని తాకే వేళ బీభత్సం సృష్టిస్తుందని జాతీయ వాతావారణ విభాగం హెచ్చరించింది. ఇది కేటగిరి 4గానూ మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో సూపర్ మూన్ అధికారులను మరింత కలవరపెడుతోంది. హరికేన్ తీరాన్ని తాకే వేళ ఈ బ్లూ మూన్ ఏర్పడుతుండటంతో తుపాను తీవ్రత మరింత పెరగనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.













