డెమొక్రాట్ల సంబరాలు… రిపబ్లికన్ల నిరసనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించే తీర్మానాన్ని ప్రతినిధుల సభ అమోదించిన తరువాత మెజార్టీ డెమొక్రాట్లు హర్షద్వానాలతో సంబరాలు జరుపుకోగా, రిపబ్లికన్లు మాత్రం తీవ్ర నిరసన తెలియజేశారు. ట్రంప్ ఉద్వాసన అనివార్యమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని రిపబ్లికన్ నేతలు డెమొక్రాటిక్ పార్టీని హెచ్చరించారు. ఇది దేశానికి చేటు అయినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదని కాలిఫోర్నియాకు చెందిన ప్రతినిధి ఎరిక్ షాల్వెల్ వ్యాఖ్యానించారు. తాము తమ దేశ ప్రజాస్వామ్య వ్వవస్థను కాపాడుకునేందుకు అభిశంసనకు అనూకూలంగా ఓటు వేశామని పలువురు ప్రతినిధులు వేర్వేరు ట్వీట్లలో పేర్కొన్నారు. అభిశంసన ఓటింగ్‌పై హర్షద్వానాలతో డెమొక్రాట్స్ సంబరాలు జరుపుకోవటం సిగ్గుచేటని సభలో మైనార్టీ పక్ష నేత కెవిన్ మెక్ కార్తీ విస్మయం వ్యక్తం చేశారు. అమెరికన్ చరిత్రలో అత్యంత బలహీనమైన అభిశంసన ఇదని ఫ్లోరిడాకు చెందిన రిప్లబికన్ ప్రతినిధి మాట్ గాయెట్జ్ అన్నారు. అభిశంసించటం ద్వారా డెమొక్రాట్లు ట్రంప్‌ను మరింత శక్తివంతం చేశారని నార్త్ కరోలినా రిపబ్లిన్ ప్రతినిధి మార్క్ మెడోస్ పేర్కొన్నారు.













