అల్లాడుతున్న అగ్రరాజ్యం
అమెరికాలో అత్యవసర ఔషధాలు, వైద్య సామగ్రికి తీవ్ర కొరత ఏర్పడింది. మాస్కులు, చేతి తొడుగులు, వైద్యులు ధరించే గౌన్ల నిల్వలు నిండుకున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వినియోగించేందుకు మాత్రమే కొద్ది మొత్తంలో వీటిని నిల్వ చేసినట్టు ఫెడరల్ ఎమర్సెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. విదేశాల నుంచి ముఖ్యమైన సామగ్రి దిగుమతికి తక్షణ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. కాగా, రష్యా నుంచి రవాణా విమానంలో 60 టన్నుల మాస్కులు, వెంటిలేటర్లు తదితర సామగ్రి బుధవారం అమెరికా చేరాయి. మేరీలాండ్లోని జాన్ హాప్కిన్స్ ఆసుపత్రికి కరోనా లక్షణాలతో ఇబ్బడిముబ్బడిగా జనం వస్తున్నారు. వారిలో ఎవరిని చేర్చుకోవాలన్నది వైద్యులకు కత్తిమీద సాములా మారింది. మరోవైపు, వివిధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు 2 లక్షల కోట్ల డాలర్ల భారీ ప్యాకేజీని ట్రంప్ ప్రతిపాదించారు.













