NATS: నాట్స్ సంబరాల్లో డైలాగ్ లతో అదరగొట్టిన అల్లు అర్జున్
ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపానగరంలోని టాంపా (Tampa) కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న నాట్స్ (NATS) సంబరాల్లో అల్లు అర్జున్ (Allu Arjun) తన డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విదేశాల్లోనూ తెలుగు వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడుతూ, ‘పుష్ప’ స్టైల్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్. ‘తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్’ అంటూ తనదైన స్టైల్‌లో డైలాగ్ చెప్పారు. ‘‘ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఎప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఆశ్చర్యానికి గురి అవుతుంటా. ఇంతమంది తెలుగు వారిని చూస్తుంటే హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అమెరికాలో మనమంతా ఇలా కలవడం అదృష్టంగా భావిస్తున్నా. నన్ను ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నాట్స్‌కు ధన్యవాదాలు. నాట్స్ గురించి సరదాగా ‘పుష్ప’ స్టైల్‌లో చెప్పాలంటే ‘నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్’. మన తెలుగు కల్చర్‌ను ముందు తరాలకు తీసుకువెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భారతీయులు ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులోనూ తెలుగోళ్లు అస్సలు తగ్గేదేలే’’ అని అల్లు అర్జున్ అన్నారు.







