అమెరికా ప్రైమరీల వాయిదా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో త్వరలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల ప్రైమరీలు వాయిదా పడ్డాయి. లూసియానా రాష్ట్రం ఈ ప్రైమరీలను ఇప్పటికే వాయిదా వేయగా జార్జియా రాష్ట్రం కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. ఈ నెల 24న జరగాల్సిన ప్రైమరీలను రెండు నెలల పాటు వాయిదా వేస్తూ జార్జియా రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే వచ్చే వారం జరగాల్సిన ప్రైమరీలను యధావిధిగా కొనసాగిస్తామంటూ ఫ్లోరిడా, ఓహియో, ఇలినాయిస్, అరిజోనా రాష్ట్రాలు ప్రకటించిన నేపథ్యంలో జార్జియా రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత లూసియానా రాష్ట్రం ఏప్రిల్ 4న జరగాల్సిన ప్రైమరీలను 11 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని ట్రంప్ సర్కారు అధికారిక విపత్తుగా ప్రకటించటంతో రాష్ట్రాలు ఈ వాయిదాల బాట పట్టినట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలలో ప్రైమరీలు వాయిదా పడుతుండటంతో నవంబర్ ఎన్నికలకు తమ అభ్యర్థిని ఎంపిక చేసుకునే విషయంపై డెమొక్రాటిక్ పార్టీలో గందరగోళ పరిస్థితికి దారి తీసే అవకాశం వుందని పరిశీలకులు చెబుతున్నారు.













