HTA: అద్భుతంగా సాగిన హారీస్ బర్గ్ ఉగాది వేడుకలు
పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని, హారిస్బర్గ్ లో, 2025 ఏప్రిల్ 12న HTA (హేరిస్ బర్గ్ తెలుగు సంఘం )ఆధ్వర్యంలో ఉగాది (Ugadi) వేడుకలు ఎంతో ఉత్సాహభరితంగా, అద్భుతమైన విజయంతో జరిగాయి. సెంట్రల్ పెన్సిల్వేనియా ఏరియాలో తెలుగు సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఈ వేడుకకు, 1200 మందికిపైగా సందర్శకులు హాజరై, ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం తెలుగు సంస్కృతి, భాష మరియు సంప్రదాయాలను సమాజంలో నిలుపుతూ, భవిష్యత్ తరాలకు అందించడమేనని నిర్వాహకులు అన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో 37కు పైగా కళా ప్రదర్శనలు నిర్వహించారు. 55 మంది కోఆర్డినేటర్లు మరియు కొరియోగ్రాఫర్లు, 420 మందికిపైగా పాల్గొన్న కళాకారులు ఉండటం విశేషం. అనేక రంగాలలో ప్రతిభను ప్రదర్శించిన చిన్నారులు, యువత, పెద్దల ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అలాగే, ముఖ్య అతిథుల ప్రసంగాలు, వివిధ విక్రయ స్టాల్స్, మరియు నూతన పరిచయాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విందు కోసం కృతుంగా ఇండియన్ రెస్టారెంట్ నుండి అందించిన భోజనం అందరినీ రుచితో మంత్రముగ్ధులను చేసింది.
హెచ్టిఎ అధ్యక్షుడు, శ్రీ శ్రీనివాస్ కాకర్ల ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విజయవంతమైన ఉత్సవానికి తోడ్పడిన కమ్యూనిటీ సభ్యులు, కోఆర్డినేటర్లు, కొరియోగ్రాఫర్లు, స్పాన్సర్లు మరియు వాలంటీర్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ మద్దతే మా బలం.’’ అని పేర్కొన్నారు.
ఈ వేడుకల అనంతరం పలువురు కార్యక్రమాలపై తమ సానుకూల అభిప్రాయాలను వ్యక్తపరిచారు. హెచ్టిఎ జనరల్ సెక్రటరీ శ్రీ ముని గిల్లా ధన్యవాద సభను నిర్వహించారు. ట్రెజరర్ శ్రీ జనార్దన్ కర్నాటి ఆర్థిక నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు కమిటీ సభ్యులంతా ఎంతో శ్రమించి నిర్విరామంగా పనిచేశారు.








