అమెరికా కలలు ఆగట్లేదు!
అమెరికాలో శాశ్వత పౌరసత్వాన్ని సంపాదించాలని చాలా మంది భారతీయులు కలలు కంటారు. ఇందుకు వీలు కల్పించే గ్రీన్‌కార్డుల కోసం పలు ప్రయత్నాలు చేస్తారు. గ్రీన్‌కార్డు సాధనకు రాచమార్గంగా భావించే హెచ్ 1 బీ వీసాల జారీని ఈ ఏడాది చివరివరకూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయుల ఆశలపై నీళ్లు చల్లారు. అయినప్పటికీ, కొందరు ప్రత్నామ్నాయ మార్గలపై దృష్టి సారిస్తున్నారు. అమెరికాలో పెట్టుబడులను పెట్టే వలసదారులకు ఇచ్చే ఈబీ-5 వీసాకు డిమాండ్ పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న హెచ్ 1బీ, హెచ్ 4 వీసాదారులు ప్రధానంగా ఈబీ 5 వీసాల వైపునకు దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
దశాబ్దాలపాటు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, ఇప్పటికే గ్రీన్‌కార్డును సంపాదించలేని హెచ్ 1బీ, హెచ్ 4 వీసాదారులు ఈబీ 5 వీసాల వైపునకు మొగ్గు చూపుతున్నారు అని ఇమిగ్రేషన్ సంస్థ క్యాన్‌యామ్ డైరెక్టర్ అభినవ్ లోహియా తెలిపారు. 2019, నవంబర్‌లో ఈబీ-5 వీసా కోసం పెట్టే పెట్టుబడులను 5 లక్షల డాలర్ల నుంచి 9 లక్షల డాలర్లకు పెంచడంతో వీటికి డిమాండ్ తగ్గిందని, అయితే, హెచ్ 1బీ వీసా జారీ రద్దు చేస్తూ ఇటీవల ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ ఈబీ-5 వీసాల వైపు చూస్తున్నారరని చెప్పారు.













