హెచ్-1బీ వీసా రెన్యువల్ అమెరికాలోనే… కానీ వారికి వర్తించదు
హెచ్-1బీ వీసా పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించేందుకు అమెరికా పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. మూడు నెలల పాటు ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే ఇది కేవలం నిపుణులకు మాత్రమేనని, వారి కుటుంబీకులకు/వారిపై ఆధారపడిన వారికి ఇది వర్తించదని తెలిపింది. వీసా రెన్యువల్ కోసం గతంలో అమెరికా విడిచి వెళ్లాల్సి వచ్చేదని, కానీ, ఈ నూతన కార్యక్రమం గణనీయ మార్పు తీసుకువస్తుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ తెలిపారు. ఈ సౌలభ్యాన్ని నిపుణుల కుటుంబీకులకు విస్తృత పరిచేముందు వాటి ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉందన్నారు. హెచ్-4 కింద వారి కుటుంబీకులు, ఆధారపడిన వారిని ఇందులో చేర్చాలని కోరుతూ ఆయా సంస్థల నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించారు.













