వైద్యులకు వీసా నిబంధనలు సడలించండి
హెచ్ 1బీ, జే1 వీసాలకు సంబంధించిన నిబంధనల కారణంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో విదేశీ వైద్య నిపుణులు కరోనా పేషెంట్లకు సేవలను అందించలేకపోతున్నాయని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) డైరెక్టర్ కెన్ క్యూసినెలీకి పలువురు కాంగ్రెస్ సభ్యులు లేఖ రాశారు. ఆ నిబంధనలను సడలించాలని ఆ లేఖలో కోరారు. హెచ్ 1బీ వీసాను సాధారణంగా ఐటీ రంగంలోని నిపుణులకు ఇస్తారు. కానీ గణనీయ సంఖ్యలో ఈ వీసాపై అమెరికాలో భారత్ సహా ఇతర దేశాలకు చెందిన వైద్యులు పని చేస్తున్నారు. అయితే, వారికి అనుమతించిన ప్రాంతాల్లో మాత్రమే ఆ డాక్టర్లకు ప్రాక్టిస్ చేసేందుకు వీలు ఉంటుంది. సాధారణంగా యూఎస్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో, వైద్య సదుపాయాలు అంతగా లేని ఇతర ప్రాంతాల్లో మాత్రమే వైద్య సేవలందించేందుకు వారికి అనుమతిస్తారు. ఈ నిబంధన కారణంగా వారు కోవిడ్ 19 ప్రబలంగా ఉన్న ఇతర ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు వీలు కావడం లేదు. ఇదే అంశాన్ని ఆ కాంగ్రెస్ సభ్యులు యూఎస్సీఐఎస్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.













