GWTCS: ఘనంగా జిడబ్ల్యుటీసిఎస్ దీపావళి వేడుకలు
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. స్టెర్లింగ్ లో జరిగిన ఈ వేడుకలకు వెయ్యిమందికిపైగా హాజరయ్యారు. ప్రముఖ గాయని శ్రీమతి సునీత గారితో వర్ణం బ్యాండ్ వారు సంగీత విభావరి యువతను, చిన్నారులను ఉర్రూతలూగించింది. శ్రీమతి సాయికాంత గారి దీపావళి ప్రత్యేక గీతం మహిళలు, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంది. సంస్థ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పండుగ దుస్తులలో చిన్నారులు, మనదైన చీరకట్టుతో మహిళలు విచ్చేసి సందడి చేశారు.. విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభమై, చిన్నారుల సంప్రదాయ నృత్య, కళాభినయంతో కొనసాగిన ఈ కార్యక్రమం అర్ధ రాత్రి వరకూ అతిధులు, మరియు సంగీత తార తోరణంతో ఆనాటి ఆపాట మధురాలను ఆలకిస్తూ, యువత ఉత్సాహ కేరింకేతాల మధ్య సాగింది. పసందైన తెలుగింటి భోజనంతో సుమారు రాత్రి 1:00 గంటల వరకూ కోలాహలంగా సాగింది. అధ్యక్షులు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ.. 51 ఏళ్ళ క్రితం తెలుగు వారిని ఏకం చేసే వేదిక కోసం ఆనాడు కొందరు పెద్దల ఔదార్యం, సహకారంతో మొదలైన ఈ సంస్థకు వెన్నుదన్నుగా నిలిచిన దాతలకు, పెద్దలకు, సంస్థ శ్రేయోభిలాషులకు, పూర్వ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.
సభికులందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కార్యవర్గాన్ని పలువురు ప్రశంసించారు.
మూడు దశాబ్దాలుగా తెలుగు వారిని అలరిస్తున్న గాయని శ్రీమతి సునీత గారిని సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులతో పాటు, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, తానా, ఆటా నాయకులు ఇతరులు పాల్గొన్నారు.






