NATS: నాట్స్ 8వ కాన్ఫరెన్స్‌లో గుత్తికొండ శ్రీనివాస్‌కు ‘మహాసామ్రాట్’ అవార్డు
నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో నాట్స్ కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ (Guthikonda Srinivas) కు ‘మహాసామ్రాట్’ అవార్డు అందించారు. కృష్ణా జిల్లాలోని దోకిపర్రిలో జన్మించిన ఆయన.. ఉపాధి కోసం అమెరికాలో అడుగు పెట్టారు. అనతికాలంలోనే జేసీజీ టెక్నాలజీస్ స్థాపించి ఎందరికో ఉపాధి అవకాశం కల్పించారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత ‘నిర్వాణ హెల్త్’లో భాగస్వామిగా చేరి హెల్త్ కేర్ రంగంలో సత్తా చాటారు. భారత్‌లో ఇన్‌ఫ్రా సహా పలు రంగాల్లో లీడర్‌గా కొనసాగుతున్నారు. సాటి తెలుగు వారికి సహాయం చేయాలనే ఆలోచనతో నాట్స్ వైపు అడుగులు వేసిన ఆయన.. నాట్స్ హెల్ప్‌లైన్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దీనికి నిధులు కూడా అవసరమనే ఆలోచనతోనే 2010లోనే పదివేల డాలర్లు విరాళం అందించారు. ఆ తర్వాత నాట్స్ హెల్ప్‌లైన్ ఫండ్ స్థాపించి ఈ సేవలు కొనసాగేలా చూశారు.
అనంతరం నాట్స్ చైర్మన్‌గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. క్యాన్సర్‌పై నాట్స్ చేపట్టిన అవగాహన కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చేరింది. హుద్ హుద్ వంటి ప్రకృతి విపత్తుల వల్ల తెలుగు రాష్ట్రాలు నష్టపోయినప్పుడు తనవంతు సాయం చేశారు. తెలుగు కళలు, కళాకారులకు పలు సత్కారాలు చేసి, తెలుగు సంస్కృతికి మద్దతుగా నిలిచారు. విజయవాడలో భారీ వరదలు వచ్చినప్పుడు హుటాహుటిన వెళ్లి రూ.కోటి విరాళం అందించారు. టాంపాలో హిందూ ఆలయ నిర్మాణానికి కృషి చేశారు. కాణిపాకం ఆలయంలో రూ.18 కోట్లతో మరమ్మతులు చేయించారు. అలాంటి మహోన్నత వ్యక్తిని నాట్స్ 8వ తెలుగు మహసభల్లో గౌరవించారు. రవీంద్ర ఆలపాటి, మూర్తి బడిగ, సీనియర్ నటులు సాయికుమార్ చేతుల మీదుగా గుత్తికొండ శ్రీనివాస్ గారు ‘మహాసామ్రాట్’ అవార్డు అందుకున్నారు.







