గ్రీన్ కార్డు ఆశలపైనా డొనాల్డ్ ట్రంప్ సర్కారు నీళ్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేపడుతున్న సంస్కరణలతో భారతీయుల అమెరికా కల చెదిరిపోతోంది. హెచ్-1బీ వీసాలపై ఎక్కువ కాలం అక్కడే ఉంటూ గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నిస్తున్న టెకీలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వీసా పునరుద్ధరణను నిరాకరిస్తూ రోజులు గడువులో భారత్‌కు తిరిగిపోవాలని హుంకుం జారీ అవుతుండటంతో.. వారు దిక్కుతోచని పరిస్థితును ఎదుర్కొంటున్నారు. కనీసం పదేళ్లకు పైగా అమెరికాలో హెచ్-1బీపై ఉంటూ గ్రీన్‌కార్డుకు అర్హత సాధించిన వారికి కూడా వీసాలు రెన్యువల్ అవ్వడం లేదు. అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) నుంచి కఠినమైన ప్రశ్నలు మరిన్ని ఆధారాలు సమర్పించాలనే డిమాండ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోనే పిల్లల్ని కన్న ఉద్యోగులకు ఇది క్లిష్టపరిస్థితి అని చెప్పవచ్చు. ఆ దేశ పౌరసత్వం ఉండే చిన్నారుల్ని తీసుకుని, భారత్‌కు తిరిగి వెళ్లడం అనేది ఊహించని పరిణామమే.













