ఘనంగా ముగిసిన టాంటెక్స్ 127వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
“పద్యం నుంచి వచన కవిత్వం దాకా“ – ఘనంగా ముగిసిన టాంటెక్స్ 127వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించు “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, ఫిబ్రవరి 18 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది.
ప్రవాసంలో నిరాటంకంగా 127 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసారు.
కార్యక్రమంలో ముందుగా కుమారి చామకూర కీర్తి దాశరధి గారు రచించిన “ఎవరయ్యా నీ వెవరయ్య” అనే చక్కని ప్రార్ధన గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది . తదుపరి శ్రీ బసాబత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ మహమ్మద్ ఖదీర్ బాబు రచించిన “దర్గామిట్ట కథలు” పుస్తక పరిచయం చేసారు. మతసామరస్యమే ప్రధానముగా ఈ కథలలో మహమ్మద్ ఖదీర్ బాబు నెల్లూరుయాసలో రచించారని, మహమ్మద్ ఖదీర్ కు ఖదీర్ బాబు అనే పేరు ఎలావచ్చిందో వివరించారు. మీసాల సుబ్బరాజు గారు ఖదీర్ బాబు అని నామకరణం చేయడం , అతనికి పాటలు ఇష్టం కానీ పాడే అవకాశం రాక పడే తపన కూలంకుషంగా వివరించారు. ఖసాబ్ గల్లీలో సేమియా ముగ్గు అనే కథలో సేమియా తయారు చేసే మిషన్, దానిని వంతుల వారీగా అందరూ పంచుకోవడం గురించి, నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ గురించి, అక్కడి మహమ్మదీయుల జీవన విధానం గురించి తెలియాలంటే ఖదీర్ బాబు గారి కథలు తప్పక చదవమని చెప్పారు.
చిన్నారులు వేముల సాహితి, సింధూర, నందిమండలం సాహిత్య, సాహితి, శంకరం బాడి సుందరాచారి గారు రచించిన “మాతెలుగు తల్లికి మల్లెపూదండ” గీతాన్ని ముద్దు ముద్దుగా గానం చేసి తెలుగు భాష మీద అభిమానాన్ని ఘనంగా చాటుకొన్నారు. శ్రీ దొడ్ల రమణ మాట్లాడుతూ “శ్రీ కృష్ణ వచనామృతం” అనే పుస్తకాన్ని పరిచయం చేశారు. ప్రస్తుతం సంఘంలో తరిగిపోతున్నది శాంతి, ఈ వర్తమాన కాలంలో, ప్రస్తుత పరిస్థితులలో మనకు అత్యంత అవసరమైనది శాంతి అని, 700 పద్య గద్య శ్లోకాలతో నిండిన ఈ పుస్తకం, ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమైన పుస్తకం అని తెలిపారు. శ్రీ పుదూర్ జగదీశ్వరన్, తాను రచించిన శతకం నుంచి ఒక పద్యాన్ని, శ్రీ చంద్రహాస్ మద్దుకూరి ప్రసిద్ధ పాటల రచయిత కొసరాజు సినీ సాహిత్యం గురించి , ఆయన మరపురాని పాటల గురించి మాట్లాడారు. 1938లో విడుదలైన “రైతు బిడ్డ” సినిమా, కొసరాజు గారు పాటలు రాసిన మొట్ట మొదటి సినిమా అని తెలియచేసారు. “నందామయా గురుడ నందామయా”, “శివశివ మూర్తివి గణనాథా” పాటలు అత్యంత ప్రాముఖ్యమైనవి అని, రోజులు మారాయి సినిమాలో 7 పాటలు రాసారు, ఏరువాక సాగరో పాట రాశారు ఈనాటికి తెలుగు మనస్సులో నిలిచి పోవడం ఆయన గొప్పదనమే అని తెలిపారు. “పెద్ద మనుషులు” లో “నందమయా గురుడ నందామయా” అనే పాట చక్కగా పాడి అలరించారు.
డా. ఊరిమిండి నరసింహ రెడ్డి – మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చాపక్రింద నీరు, చుక్కలు చూసి కుక్కలు మొరిగినట్లు, చుట్టాల సురభి, ఇంకా ఎన్నో సామెతలు వాటి అర్ధాలు వివరించారు. శ్రీ వేముల లెనిన్ – “శివ సాహిత్యంలో కొన్ని సంగ్రహణలు” అనే అంశంపై మాట్లాడుతూ, బెజ్జమహాదేవి శివుని తల్లిగా ఉంటే ఆవిడ అనురాగం ఎలా ఉండేదో ఫాల్కురికి సోమనాథుడు వివరించినట్లు కొన్ని ఉదాహారణలతో తెలిపారు. “శివ శివ భరణం” అని శ్రావ్యంగా గానం చేశారు. ఆధునిక కవులలో సిరివెన్నెల సీతారామశాస్త్రి “ఆది భిక్షువు వాని ఏది కోరేది” అనే పాటలో శివతత్వాన్ని ఎంత చక్కగా వివరించారో గానయుక్తంగా వివరించారు. సుద్దాల అశోక తేజ రచించిన నటరాజు పూజ చేసే అనే పాటకు జాతీయ అవార్డు వస్తే ఎంతో బాగుండేది అని గుర్తు చేసుకొన్నారు.
శ్రీమతి అట్లూరి స్వర్ణ కొన్ని ఛాయాచిత్రాలు చూపించి వాటిద్వారా సామెతల పూరణం చేయించడం, ఎంతో ఆసక్తి కలిగించింది. తెలుగు భావకవిత్వం ని ఆంగ్లంలో “లిరికల్ పొయిట్రీ” అంటారు, తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపు కొంటారు, భరతుని భార్య పేరు ఏమిటి, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో క్విజ్ నిర్వహించారు.
పాలకమండలి అధిపతి చంద్ర కన్నెగంటి ముఖ్య అతిథి శ్రీ హెచ్చార్కె ని సభకు పరిచయం చేశారు.
“పద్యం నుంచి వచన కవిత్వం దాక”మార్పు ఎలా సంభవించిందో అనే అంశం మీద ప్రసంగించారు. కర్నూలు జిల్లా గని అనే చిన్న పల్లెటూరు లో , కనీస వసతులు లేని చోట జన్మించిన తనకు, ఊరికి ఉన్న ఒకే ఒక్క రేడియో దగ్గర పద్యాలు వింటూ, వాటిపై ఆసక్తి పెంచుకున్న సంఘటనలు వివరించారు. చిన్నతనం నుండి తనకు సీస పద్యాలు అంటే ఇష్టం అని , తాను కూడా కొన్ని పద్యాలు రాశాను అని తెలియచేసారు. తదుపరి వచన పద్యం పైనున్న ఆసక్తితో, వచన కవిత్వం వైపు పయనించాను అని తెలియచేసారు. గురజాడ వెంకట అప్పారావు వచన కవిత్వానికి ఆద్యుడు అని, ముత్యాల సరాలు లో 14 మాత్రలు ఉంటాయని, మాత్ర ఛందస్సులో సులభ గ్రాహ్యంగా ఉంటుంది అని, వాటి అందమే వేరు అని కొన్ని పద్యాలు చదివి వినిపించారు. తెలుగు ఛందస్సులో రెండు మెట్లు దిగిన ఛందస్సు ఏదైనా ఉంది అంటే అది ముత్యాల సరాలు అని తెలిపారు. పద్యం సరళంగా ఉంటే అందంగా ఉంటుంది అని తిరుపతి వెంకట కవులు రాసిన పద్యాలు ఎంతో సులభంగా ఉంటాయి ఉదాహారణలతో తెలిపారు. స్వేచ్ఛ అంటే కట్టుబాట్లు నుండి విముక్తి అని, కృష్ణ శాస్తి తర్వాత అంతబాగా స్వేచ్ఛను అందిపుచ్చుకొన్నవాడు ఇస్మాయిల్ అని తెలిపారు. ఈ సందర్భముగా ఇస్మాయిల్ రాసిన పద్యాలు కొన్ని ఉదహరించారు. స్వేచ్చకు ఉన్న పరిమితులు అర్ధం చేసుకున్నవాడు ఆధునికుడు. పట్టాభి ఫిడేల్ రాగాలు తప్పకుండా చదవాలి అని గుర్తు చేశారు. ఆయన రాసిన పద్యాలు చక్కగా చదివి వినిపించారు. వచన పద్యాల గొప్పతనం ఫిడేల్ రాగాలలో ఎంత చక్కగా రాసారో వివరించారు.
హెచ్చార్కె గారిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శ్రీమతి శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. హెచ్చార్కె గారు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
టాంటెక్స్ అధ్యక్షురాలు శ్రీమతి కృష్ణవేణి శీలం గారు మాట్లాడుతూ మారు మూల పల్లెటూరు లో జన్మించి, కవిగా, జర్నలిస్ట్ గా ఎనలేని సేవ చేసిన హెచ్చార్కె గారి సేవలను ఎంతో కొనియాడారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, మన టి.వి,టి.ఎన్.ఐ, ఏక్ నజర్ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.













