తెలుగు భాషకు వన్నె తెచ్చిన తానా తెలుగు పద్యవైభవ సదస్సు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 29న అంతర్జాతీయ వర్చువల్ సమావేశంలో జరిగిన తెలుగు పద్య వైభవ సదస్సు అత్యంత విజయవంతంగా జరిగింది. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి తొలుత స్వాగత ఉపన్యాసం చేశారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన పద్యం తెలుగు భాషకు వన్నె తెచ్చింది. నన్నయ్య, పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన, అల్లసాని పెద్దన, వేమన, బద్దెన, రామదాసు వంటి అనేక మంది కవులు అద్భుతమైన పద్యాలు రచించారు. యతి, ప్రాసలతో సశాస్త్రీయమైన ప్రణాళికలతో, ఛందస్సుతో, రచింపబడే పద్య పక్రియ ఎంతో గొప్ప పక్రియ. కేవలం తెలుగు భాషలోనే ఉన్న అద్భుత పద్య పక్రియను పరిరక్షించాల్సిన అవసరం అందరిమీద ఉందని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహా సహస్రావధాని డా. గరికపాటి నరసింహారావును తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేస్తూ… గరికపాటి ప్రసంగాలన్నీ కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలే అనుకుంటే పొరబాటేనని ఆయన ప్రసంగాలలో మానవ విలువల పరిరక్షణ, సామాజిక బాధ్యత గుర్తు చేసే అంశాలతో పాటు మృగ్యమైపోతున్న మానవ సంబంధాలు, పక్కదారి పడుతున్న యువత, అజ్ఞానం, అంధ విశ్వాసాలు, మూడనమ్మకాలలో కొట్టుమిట్టాడుతున్న అమాయక ప్రజలకు తన వేద విజ్ఞాన మదింపు, శాస్త్ర విజ్ఞాన జోడింపుతో కూడిన గరికపాటి పలుకులు మానవాళికి మేలుకొలుపులన్నారు. ఎంతో ఆవేశం, అర్ధం, ఆర్ధ్రతతో కూడిన గరికపాటి ప్రసంగాలు ఒక్కొక్కప్పుడు భుజం తట్టి పలకరించినట్లు, మరొక్కప్పుడు కొరడాతో వెన్నుపై కొట్టి హెచ్చరించినట్లు ఉంటాయన్నారు.
డా. గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ… తెలుగు భాష పరిరక్షణ అనేది ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలతో తెలుగులో సంభాషించాలని అప్పుడే తెలుగు భాష పరిరక్షించబడుతుందన్నారు. ఆంగ్ల వాతావరణం ఉండే అమెరికాలోని పిల్లలు శ్రావ్యంగా పద్యాలు పాడటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. మహా భారతంలో నన్నయ్య రచించిన శకుంతల దుష్యంతుడు వ•త్తాంతం నుంచి నేటి స్త్రీలు ధైర్యాన్ని నేర్చుకోవాలని సూచించారు. నూతులు తవ్వడం కన్నా, బావులు తవ్వించడం కన్నా, యజ్ఞాలు చేయడం కన్నా, పుత్రులను కనడం కన్నా, సత్యం మీద నిలబడటం గొప్ప విసయం అనే సందేశం అద్భుతంగా ఆ వృత్తాంతంలో ఆవిష్కరించబడింది అన్నారు. నన్నయ్య, తిక్కన, ఎరాప్రగడ, బమ్మెర పోతన, శ్రీనాధుడు, శ్రీ కృష్ణ దేవరాయలు, అల్లసాని పెద్దన, జంధ్యాల పాపయ్యశాస్త్రీ రచించిన ఎన్నో పద్యాలను ఉటంకిస్తూ సామాజిక చైతన్యం కలిగించే విధంగా విశ్లేషించారు. రెండు గంటల పాటు సాగిన గరికపాటి ప్రసంగం ఆద్యంతం చలోక్తులతో, పద్య గాన మాధుర్యంతో అద్భుతంగా అందరినీ అలరించింది. ఈ కార్యక్రమం రెండో భాగంలో కొమండూరి రామాచారి, పార్థు నేమాని, గుమ్మడి గోపాలకృష్ణ శిక్షణలో అమెరికాలో పుట్టి పెరుగుతున్న యువతరంచే జరిగిన పద్య గానలహరి అందరినీ పరవశింపజేసింది.
రామాచారి శిష్యులు దాశరథి, వేమన, సుమతీ శతక పద్యాలను శ్రావ్యంగా పాడారు. పాడిన వారు.. రాహుల్ శిస్టా(సియాటెల్- వాషింగ్టన్), అనన్య రాయపరాజు(బ్రిడ్జి వాటర్- న్యూజెర్సీ), భావన నాగోటి (డౌనింగ్ టౌన్- పెన్సిల్వేనియా), శ్రీజ బొడ్డు (న్యూజెర్సీ), సృష్టి చిల్ల (న్యూజెర్సీ), శర్వాణి సాయి గండ్లూరి (డల్లాస్- టెక్సాస్), మల్లిక సూర్యదేవర (డల్లాస్- టెక్సాస్), శ్రీతన్ పిట్టల (నెవార్క్- డెలావేర్), శ్రియ పిట్టల (నెవార్క్- డెలావేర్), అభిజ్ఞ యనగంటి (యాష్బర్న్- వర్జీనియా), శ్రియా నందగిరి (బ్లైనా- మిన్నెసోట), ప్రణవ్ అర్కటాల (అట్లాంటా- జార్జియా), శృతి నాగులపల్లి (శాన్హోజే- కాలిఫోర్నియా), వర్ష జనుంపల్లి (ఫ్రిస్కో- టెక్సాస్), లయ నీలిసెట్టి (న్యూజెర్సీ), ఆరుషి రామక (న్యూజెర్సీ), సాయి తన్మయి ఇయ్యున్ని (డల్లాస్- టెక్సాస్), శరణ్య వక్కలంక (వర్జీనియా).
పార్థు శిష్యులు భాగవత పద్యాలను అతి మధురంగా పాడారు. వారు.. మేధా అనంతుని(ఆస్టిన్- టెక్సాస్), వేదాంత్ అత్తిలి (బెంటన్ విల్- ఆర్కేన్సా), మేధా నేమాని (శాన్ హోజే- కాలిఫోర్నియా), శ్రియా చెముడుపాటి (రిచ్మండ్- వర్జీనియా), సంహిత పొన్నపల్లి (హ్యూస్టన్- టెక్సాస్), భార్గవ్ నేమాని (శాన్హోజే- కాలిఫోర్నియా), శ్రీవల్లభ కొమండూరు (న్యూజెర్సీ), శ్రీవల్లి కొమండూరు (న్యూజెర్సీ).
గుమ్మడి గోపాలకృష్ణ శిష్యులు పౌరాణిక పద్యాలను రాగయుక్తంగా ఆలపించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. వారు.. ఆముక్త శ్రీనాగ దాసరి(కేరి- నార్త్ కరోలినా), కార్తిక్ దూసి(పొకేప్సి- న్యూయార్క్), శౌర్య మంత్రాల(కేరి- నార్త్ కరోలినా), స్రవంతి మానికొండ(ప్లేన్స్ బొరో- న్యూజెర్సీ), శ్రీహిత ఎలమంచిలి(ఆపెక్స్- నార్త్ కరోలినా). ఇటీవల జరిగిన తానా బాలోత్సవంలో పాల్గొని విజేతలైన రిషికా గోటేటి(న్యూజెర్సీ), హన్సిత చెంచల(ఫ్లోరిడా), రిషికేశ్ మద్దన(మారల్టన్- న్యూజెర్సీ) కూడా పాల్గొని తమ పద్యాలను మధురంగా వినిపించారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పద్య పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం పద్యకవులు, అవధాన కవులు పద్య జైత్రయాత్రలు ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తానా ఫౌండేషన్ కోశాధికారి జగదీష్ ప్రభల తన మలి పలుకులలో ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన సుమంత్ రామిశెట్టి, శ్రీధర్ చిల్లర, ప్రశాంత్ కొల్లిపర, పురుషోత్తం నార్గౌనికు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని విద్యార్థులకు అద్భుత శిక్షణ ఇచ్చి మంచి గాయనీ గాయకులుగా తీర్చి దిద్దుతున్న రామాచారి, పార్థు, గుమ్మడిలకు.. పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.













