బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం స్నేహోత్సవం విశేషాలు
బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం తన మూడు దశాబ్దాల ఘనచరిత్రలో మొదటి సారిగా 2018 జూన్ 2-3 తేదీలలో కాంప్ వినడులో నిర్వహించిన వేసవి శిబిరం దిగ్విజయంగా ముగిసింది. రెండు వందల యాభై మంది సభ్యులు పాల్గొన్న ఈ స్నేహోత్సవంలో ఆటా, పాటా, సందడీ, సరదాలు చిందులు తొక్కాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ శిబిరంలో క్రీడాబృందం నిర్వహించిన వాలీబాల్, బాస్కెట్ బాల్, త్రో బాల్, టెన్నిస్, lemon & spoon race, sack race, తొక్కుడు బిళ్ళ వంటి ఆటల పోటీలలో పెద్దలు పిల్లలు అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం వేళ ఆరుబయట తెల్లని బట్టలు మల్లెల మనసులతో smores తాయిలాలు తింటూ చలి మంటల చుట్టూ కూర్చుని వుండగా రవి మేకల రాగయుక్తంగా పాడిన శ్రీకృష్ణ రాయబారంలోని పద్యాలు అందరిని అలరించాయి. AV బృందం నిర్వహించిన karaoke తో పాత, కొత్త, తెలుగు పాటలను కొంత మంది పాడగా, అందరు వంత పాడుతూ ఆనందించారు. ఔత్సాహికులు కొందరు చలిమంటల చుట్టూ తిరుగుతూ నాట్యం చేసారు.
ఆ తర్వాత, ఇన్డోర్ స్టేడియంలో జరిగిన బింగో ఆట, డాన్స్ కార్యక్రమాలలో అందరు పాల్గొని చలి రాత్రికి వేడి పుట్టించారు. వాతావరణం అనుకూలించటంతో మరునాడు పలువురు సభ్యులు, ప్రకృతి అందాలను వీక్షిస్తూ, పరిసరాల్లో ఉన్న పిట్సఫిల్డ్ అడవిలో సాహసంతో కొండపైకి హైకింగ్ చేసారు. కాంప్ యాజమాన్యం అందించిన భోజన సదుపాయాలు అందరిని ఆనందింప చేశాయి. వాటికి తోడు అందరికి భోజనంలో వేడి వేడి అన్నంతో పాటు వడ్డించిన కొత్త ఆవకాయ, మాగాయ, పప్పుల పొడి, ఘుమ ఘుమలాడే నెయ్యి, మిఠాయిలు, savories ఎంతో ఆశ్చర్యాన్ని, సంతృప్తిని కలిగించాయి. పర్యావరణ పరిరక్షణా నిబద్ధులైన హరిత బృందం భోజన సమయాల్లో ప్లాస్టిక్ మరియు styrofoam వాడకం నివారించ సంకల్పించి, వాడి కడిగి తిరిగి వాడుకునేలా సుమారు 250 ప్లేట్లు, 300 గ్లాసులు, 150 గిన్నెలు తెచ్చి, ఉపయోగించి చాలా ఆత్మ సంతృప్తిని, సభ్యుల మెచ్చుకోళ్ళని మూటగట్టుకున్నారు. కాంప్ జరిగిన రెండురోజులు వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల కాంప్ కారక్రమాలు ఎంతో ఆహ్లాదంగా జరిగాయి. ఆటలలో విజయం సాధించిన క్రీడాకారులందరికి బహుమతుల ప్రదానముతో కాంప్ ముగిసింది. కాంప్ ను నిర్వహించిన TAGB కార్యనిర్వాహక బృందం కృషిని అందరు అభినందించారు. ఈ సందర్బంగా TAGB అధ్యక్షురాలు శ్రీమతి మణిమాలగారిని కాంప్ ను ఎంతో చక్కగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా పలువురు ప్రశంసించారు.













