Modi: అనుకున్నట్లుగానే సాగిన మోదీ అమెరికా యాత్ర
భారత ప్రధాని నరేంద్రమోదీ(Modi) అమెరికా పర్యటన అనుకున్నట్లుగానే సాగింది. అమెరికా రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Trump) ను అభినందించడమే ప్రధాన అజెండాగా ఉన్నప్పటికీ ఇతర విషయాలను కూడా మోడీ ప్రస్తావించి భారత్‌కు అనుకూలంగా చర్యలు ఉండేలా చేయగలరని అనుకున్నారు. ట్రంప్ స్వతహాగా వ్యాపార వేత్త. కనుక రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి వ్యాపారవేత్తగానే వ్యవహరిస్తున్నారు. మోడీ తనకు చిరకాలమిత్రుడని అంటూనే సుంకాల విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. మరోవైపు భారత్ తో సైనిక సంబంధాలను పెంచుకోవాలని అమెరికా ఎదురు చూస్తోంది. ఇందులో భాగంగానే ఎఫ్-35 యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించే అంశం గురించి మోడీతో ట్రంప్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
అమెరికా ఏ దేశంతో మైత్రి చేసినా వాణిజ్య సంబంధాలను మెరుగు పర్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటుంది. వాణిజ్యసంబంధాలను సమతూకం చేసేందుకు చమురు, గ్యాస్‌లను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని ట్రంప్ ప్రతిపాదించారు. అమెరికా విధించే ఎదురు సుంకాల భారాన్ని తగ్గించుకోవాలని మన దేశం చూస్తోంది. ఇందుకు ట్రంప్ తో మాట్లాడినా, ఆయన దీనిపై పెద్దగా సానుకూలత చూపలేదు. ఎదురు సుంకాల విషయంలో తన వైఖరి మారదని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చల్లో ప్రతిష్టంభన వచ్చే వాణిజ్య వివాదాలప్రస్తావన లేకుండా చర్చలు ముగించడం కూడా గడుసుదనమే. ట్రంప్ ధోరణి తమ దేశంపై భారమేమీ పడకుండా సాధ్యమైనంత వరకూ ఇతర దేశాల నుంచి గుంజుకోడ మేనన్నది ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్న ప్రకటనలు, ప్రసంగాలను బట్టి స్పష్టం అవుతోంది.
ఆప్యాయ స్వాగతం…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 13వ తేదీన అమెరికాకువచ్చారు. అమెరికాలోని ఎన్నారైలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అధికారులు ఆయనను నేరుగా బ్లేయర్ హౌస్‌కి తీసుకు వెళ్లారు. అక్కడే మోదీకి బస ఏర్పాటు చేయగా.. 14వ తేదీ ఉదయం శ్వేత సౌధానికి వెళ్లారు. అక్కడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. మోదీని చూసిన వెంటనే ట్రంప్ ఆయన వద్దకు వచ్చి ఆప్యాయంగా హత్తుకున్నారు. మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను మిత్రమా అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఇద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ తన స్నేహితుడైన మోదీకీ ప్రత్యేక బహుమతి అందజేశారు. తానే స్వయంగా రాసిన ‘‘అవర్ జర్నీ టుగెదర్’’ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఈ పుస్తకం మొదటి పేజీలోనే ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ ఆర్ గ్రేట్’’ అంటూ రాసి కింద సంతకం చేశారు.
ఈ పుస్తకంలో మోదీతో ట్రంప్ దిగిన ఫొటోలు ఉన్నాయి. 2019లో మోదీ అమెరికాలో పర్యటించగా.. ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఇద్దరు నేతలు కలిసి దిగిన ఫొటోలను ఆ పుస్తకంలో పొందుపరిచారు. అలాగే ఆ తర్వాత ఏడాది ట్రంప్ భారత దేశానికి రాగా.. ‘‘నమస్తే ట్రంప్’’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను సైతం పుస్తకంలో ఉంచారు. ఈ ఫొటోలు అన్నింటిని ట్రంప్ దగ్గరుండి మోదీకి చూపించగా.. ప్రధాని చాలా సంతోష పడిపోయారు. ట్రంప్ ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ.. భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చాలా కాలం నుంచి మోదీ తన స్నేహితుడు అని తమ మధ్య మంచి అనుబంధం ఉందన్నారు. అలాగే మోదీ కూడా ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడి నుంచి తాను ఓ మంచి విషయం నేర్చుకున్నానని చెప్పారు. అదే దేశ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడం అని వివరించారు.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన సమావేశం ఇలాంటి పలు కీలక ఒప్పందాలకు వేదికైంది. రెండు రోజుల అమెరికా పర్యటనలో అధ్యక్షునితో మోదీ వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో భేటీ అయ్యారు. మోదీ మూడోసారి ప్రధానిగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక వారి మధ్య ఇదే తొలి సమావేశం కావడం విశేషం.
ట్రంప్-మోదీ భేటీలో ముఖ్యమైన అంశాలివే
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సమావేశంలో ముఖ్యంగా వాణిజ్య వివాదాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై ప్రధానంగా చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ల డాలర్ల స్థాయికి తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, వ్యూహాత్మక ఖనిజాలు వంటి కీలక రంగాలపై చర్చలు జరిగాయి. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం యొక్క ఆవశ్యకతను ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు.
మరోవైపు ట్రంప్ మాత్రం భారత్ విధిస్తున్న సుంకాలు అన్యాయమైనవి అంటూ పరస్పర టారిఫ్‌ల విషయంలో తాను మొహమాటపడబోనని స్పష్టం చేశారు. రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు: చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు అమెరికా భారతదేశంతో సైనిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో ప్రయత్నించినట్లు కనిపించింది. ఇందులో భాగంగానే 10-సంవత్సరాల రక్షణ సహకార ప్రణాళిక కింద ఎఫ్ 35 ఫైటర్ జెట్ల విక్రయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు ముకుతాడు వేసే దిశగా అధినేతల భేటీలో మరిన్ని నిర్ణయాలు జరిగాయి. వాటిలో భాగంగా భారత్‌కు మరో 6 అత్యాధునిక పీ 8ఐ దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, స్ట్రైకర్ యుద్ధ వాహనాలను భారత్‌లో సంయుక్త తయారీ తదితరాలకూ సమ్మతించింది. అమెరికా నుండి చమురు దిగుమతులను పెంచడానికి, భారత్: ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి మరియు ఎదురు సుంకాలను నివారించడానికి భారతదేశం యుఎస్ నుండి చమురు మరియు గ్యాస్ దిగుమతులను పెంచేలా చర్యలు చేపట్టాలని ట్రంప్ యంత్రాంగం సూచించినట్లు తెలుస్తోంది. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి వచ్చే పదేళ్ల కాలానికి రోడ్‌మ్యాప్ రూపొందించుకునేలా ఈ పర్యటన సాగినట్లు తెలుస్తోంది. మరోవైపు అంతరిక్ష రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఇరుదేశాల నేతలు అంగీకారానికి వచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొ నేందుకు ఢిల్లీ-వాషింగ్టన్ మునుపెన్నడూ లేనంత కలిసికట్టుగా పనిచేయనున్నట్లు పత్రికా విలేఖరుల సమావేశంలో ట్రంప్ తెలిపారు. భారత్ కోరుతున్న నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్‌కు వెంటనే అప్పగించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. భారత్ వినతుల మేరకు మరికొన్ని అప్పగింతలు కూడా ఉండబోతున్నాయని చెప్పారు. భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతుండటాన్ని తాను చూస్తున్నానని ట్రంప్ అన్నారు. అక్కడ పరిస్థితులు మెరుగుపడేలా సాయం చేయడానికి సంసిద్ధత వ్యక్తంచేశారు. భారత్-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక నడవా నిర్మాణం విషయంలో పరస్పరం సహకరించుకోవాలని దిల్లీ-వాషింగ్టన్ నిర్ణయించు కున్నట్లు చెప్పారు. భారత్-అమెరికా మధ్య సుంకాలపై అందరి దృష్టీ నెలకొన్న నేపథ్యంలో ‘మోదీ, ట్రంప్‌లలో మెరుగ్గా బేరసారాలు చేసేదెవరు?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ఆ విషయంలో నాకంటే మోదీయే మెరుగు’ అని ట్రంప్ ఠక్కున సమాధానమిచ్చారు.
మరోవైపు మోదీ మాట్లాడుతూ, భారత్-అమెరికా సహకారం మెరుగైన ప్రపంచానికి రూపునిస్తుందని మోదీ పేర్కొన్నారు. రానున్న దశాబ్దంకోసం ఇరుదేశాల మధ్య రక్షణ సహకార ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసుకోనున్నట్లు ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు పరిష్కారం కొనుగొనేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఆ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా శాంతివైపు నిలబడిరదని పునరుద్ఘాటించారు. ట్రంప్‌తో భేటీలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్అదానీ కేసు విషయం చర్చకు వచ్చిందా అని ఎదురైన ప్రశ్నకు మోదీ తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘భారత్ ప్రజాస్వామ్య దేశం. యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా మేం పరిగణిస్తాం. రెండు దేశాలకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు ఎప్పుడూ వ్యక్తుల విషయాలను చర్చించరు’’ అని పేర్కొన్నారు.
అమెరికా వర్సిటీలకు మోదీ ఆహ్వానం
భారత్‌లో ప్రాంగణాలను ఏర్పాటుచేయాలంటూ అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు. విద్యాపరంగా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి అవి దోహదపడతాయన్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్, బోస్టన్లలో భారత్ త్వరలోనే నూతన కాన్సులేట్లను ఏర్పాటుచేయనున్నట్లు మోదీ ప్రకటించారు. ఏదీ ఏమైనా మోదీ తాజా పర్యటన అమెరికాలో, ముఖ్యంగా ట్రంప్‌తో తనకుఉన్న మైత్రీ బంధాన్ని మరోమారు తెలియజేసింది. అమెరికాతో మరింతగా భాగస్వామి అయ్యేందుకు తోడ్పడింది.
మస్క్ పిల్లలకు బహుమతులు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలనూ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో మోదీ పోస్ట్ చేశారు. ఈ క్రమంలో మస్క్ భాగస్వామి, భారత మూలాలున్న శివోన్ జిలిస్(39) మరోసారి చర్చనీయాంశంగా మారారు.
అలాగే మస్క్ సైతం మోదీకి కానుక అందజేసినట్లు సమాచారం. ఆ కుటుంబంతో విస్తృత అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా తెలియజేశారు. మోదీ మస్క్ ముగ్గురు పిల్లలు అయిన ఎక్స్, స్ట్రైడర్, అజూర్‌లతో సరాదాగా మాట్లాడారు. అలాగే వారికోసం తాను భారత్ నుంచి తెప్పిన ప్రత్యేక బహుమతులను అందజేశారు. చిన్నారుల్లో జ్ఞానం పెంపోందేలా మూడు పుస్తకాలను అందజేశారు. అందులో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్ రచించిన ‘‘ది క్రెసెంట్ మూన్’’, ది గ్రేట్ ఆర్కే నారాయణ్ కలెక్షన్, పండిరట్ విష్ణు శర్న రచించిన పంచతంత్ర పుస్తకాలు ఉన్నాయి. వీటిని తీసుకున్న మస్క్ పిల్లలు సైతం వాటిని పట్టుకునే కనిపించారు. అందులో ఏమున్నాయో తెలుసుకునేందుకు వారు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.
జేడీ వాన్స్ పిల్లలకు గిఫ్ట్‌లు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుమారుని పుట్టిన రోజు వేడుకలకు మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ పిల్లలకు ఇచ్చిన బహుమతులు హాట్‌టాపిక్‌గా మారాయి. భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా, పర్యావరణ హితమైనవి బహుమతులగా వారికి ఇవ్వడం విశేషం. టాయ్ ట్రైన్, ఆల్ఫాబెట్ సెట్‌ని అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ పిల్లలకు ఇచ్చారు మోదీ. పర్యావరణ అనుకూలంగా.. చెక్కతో చేసిన వర్ణమాల సెట్‌ని జేడీ వ్యాన్స్ కుమార్తె మిరాబెల్ రోజ్ వాన్స్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇది పిల్లలకు మంచిగా అక్షరాలను గుర్తుపట్టేలా చేసి తొందరగా నేర్చుకునేందుకు దోహదపడుతుంది. ఇది ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా, హానికరమైన రసాయనాలు లేని బహుమతి. అంతేగాదు పర్యావరణ పరిరక్షణకు తాము పెద్ద పీట వేస్తాం అనేలా పరోక్షంగా మోదీ చెప్పినట్లుగా ఉన్నాయి ఆ బహుమతులు.







