AAA: ఘనంగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఉర్రూతలూగించిన తమన్ సంగీత విభావరి, నృత్యాలు, ప్రసంగాలు
అమెరికాలో ఆంధ్రుల చేత, ఆంధ్రులకోసం ఏర్పాటైన జాతీయ స్థాయి తెలుగు సంఘం ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా (Phildelphia) ఎక్స్పో సెంటర్లో మొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహించిన మహాసభల వేడుకలు అంగరంగవైభవంగా జరిగింది. మహాసభ లను విజయవంతం చేయడంతోపాటు ఎంతోమంది తెలుగువారిని ఈ వేడుకల్లో పాల్గొనేలా కృషి చేసి విజయవంతమైంది. మార్చి 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు అహో అనిపించాయి.
ఎఎఎ మొదటిరోజు వేడుకలు… అద్వితీయం
ఎంతోమంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక వైభవంగా జరిగింది. మార్చి 28వ తేదీ సాయంత్రం బాంక్వెట్ వేడుకలతో మహాసభలు ప్రారంభమయ్యాయి. ముందుగా వచ్చిన అతిధులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు. ముaందుగా పూజారుల మంత్రాల నడుమ జ్యోతి ప్రజ్వలనతో బాంక్వెట్ డిన్నర్ మొదటి రోజు కార్యక్రమాన్ని శుభకరంగా ప్రారంభించారు. కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం గావించారు. బాంక్వెట్ డిన్నర్ నైట్ కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన ప్రదేశాలను తెలియజేసేలా రూపొందించిన బస్సు ముందు ఎంతోమంది ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అలాగే ఎఎఎ పేరుతో ఏర్పాటు చేసిన కటౌట్ ముందు కూడా పలువురు ఫోటోలు దిగారు.
వ్యాఖ్యాతగా ఉన్న లోహిత్ కుమార్, లక్కీశర్మ తమదైన వ్యాఖ్యానాలతో సభను ఆకట్టుకున్నారు. తరువాత మిర్చి భార్గవి యాంకరింగ్ చేస్తూ అందరినీ అలరించారు.
కార్యక్రమాల్లో భాగంగా హీరోయిన్లను, హీరోలను వేదికపైకి పిలుస్తూ వారిచేత బహుమతులను అందింపజేశారు. కన్వెన్షన్ ను పురస్కరించుకుని ఎఎఎ నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఈ కన్వెన్షన్ లో బహమతులను అందించారు. తరుణ్, సుశాంత్, ఆది సాయికుమార్, సందీప్‌కిషన్ తదితరులు వేదికపైకి వచ్చారు. హీరోయిన్లు రుహానీశర్మ, కుషిత, ఆనంది వేడుకల్లో మెరిశారు. వీరితోపాటు కాలిఫోర్నియాలో ఉంటున్న మరో హీరోయిన్ జోశర్మ కూడా అందరినీ ఆకర్షించారు.
కార్యక్రమాల్లో భాగంగా ఎఎఎ ఫౌండర్ హరి మోతుపల్లిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఎఎ మొదటిసారి ఇంతపెద్దఎత్తున కన్వెన్షన్ జరిపిందంటే అందుకు కారణం అందరి సహకారంతోనే అన్నారు. తన ఒక్కడి విజయం కాదని, ఎఎఎలో ఉన్న అందరూ దీని వెనుకాల ఉన్నారని చెప్పారు. తరువాత నేషనల్ ప్రెసిడెంట్ బాలాజీ వీర్నాల మాట్లాడుతూ, ఈ కన్వెన్షన్ విజయంకోసం ఎంతోమంది శ్రమించారని అందరికీ ధన్యవాదాలని చెప్పారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి మాట్లాడుతూ, ఊహించిన దానికన్నా ఇంతమంది వచ్చి కన్వెన్షన్ ను విజయవంతం చేసిన ఎంతోమంది పెద్దలకు, అతిధులకు, వలంటీర్లకు, కమిటీ సభ్యులకు ధన్యవాదాలను తెలియజేశారు.
సినీ నటులు తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. ఆముదాలవలస, మార్కాపురం టీడీపీ శాసనసభ్యులు కూన రవికుమార్, కందుల నారాయణ రెడ్డి మరియు వైజాగ్ సౌత్ జనసేన శాసనసభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ లను వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.
ప్రముఖ దర్శకుడు సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆయనను ఎంతోమంది అభిమానులు పలకరించి ఉత్సాహంగా ఆయనతో ఫోటోలను దిగారు. అలాగే ఇతర దర్శకులు శ్రీనువైట్ల, వీరభద్రం తదితరులు కూడా స్టేజిమీదకు వచ్చారు.
వచ్చిన అతిధులకోసం తొలుత స్నాక్స్ లాంటి వంటకాలను అందించారు. డిన్నర్లో మాత్రం షడ్రసోపేతమైన ఆంధ్ర వంటకాలను, ఇతర పంచభక్ష్యపరమాన్నాలను వడ్డించారు. చివరన నిరవల్ బ్యాండ్ లైవ్ మ్యూజిక్ తో మొదటిరోజు కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి.
2వ రోజు…
కన్వెన్షన్ రెండో రోజు కూడా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం శాస్త్రోక్తంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు.తిరుమల నుంచి వచ్చిన అర్చకులు శ్రీనివాస కళ్యాణంను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఎఎఎ నాయకులు, వచ్చిన అతిధులు పలువురు పాల్గొని స్వామివారి ఆశీర్వాదములను అందుకున్నారు. ఉగాదిని పురస్కరించుకుని పంచాగ శ్రవణం కూడా చేశారు. లంచ్ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం ముఖ్య అతిథులు రాగానే క్లాసికల్ నృత్యాలతో ఆంధ్ర సంస్కృతికి అద్దం పట్టారు. మధ్య మధ్యలో స్పాన్సర్స్ ప్రమోషన్ వీడియోలు ప్రదర్శించారు. మహిళలు చక్కని ఇండియన్ ట్రెడిషనల్ వస్త్రధారణలో ప్రదర్శించిన ఫ్యాషన్ షో (అందరినీ ఆకట్టుకుంది. కొన్ని సినిమా పాటల నృత్యాల అనంతరం మార్కాపురం, ఆముదాలవలస ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, కూన రవికుమార్ ప్రసంగించారు. తెలుగు సినీ ప్రపంచానికి చెందిన నటీనటులు వేదికపై ముగ్గుల పోటీలు, షార్ట్ ఫిల్మ్స్ పోటీల విజేతలను ప్రకటించారు.
ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోస్ సుశాంత్, విరాజ్ అశ్విన్ వచ్చినవారిని ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సగౌరవంగా సన్మానించారు. అలాగే కన్వెన్షన్ కమిటీల లీడర్షిప్ ని సభికులకు పరిచయం చేసి వారి సేవలను కొనియాడారు. దక్షయఙం పౌరాణిక కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ప్రసంగాలు అలరించాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎఎఎ ఛాప్టర్ల నాయకులను కూడా ఈ మహాసభల వేదికపైకి ఆహ్వానించి సత్కరించారు. మాట్లాడిన పలువురు వక్తలు ఎఎఎ అసోసియేషన్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వేదికపైకి తానా నాయకులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.
ఇక చివరిగా వరుస సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి మంచి ఫార్మ్ లో ఉన్న టాలీవుడ్ ఫేమస్ సంగీత దర్శకులు తమన్ సంగీత విభావరి జరిగింది. గ్రాండ్ ఎంట్రీతో తమన్ వేదిక పైకి విచ్చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా పాటతో మొదలు పెట్టి, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీస్‌లోని పాటలతో హోరెత్తిం చారు. మధ్య మధ్యలో జై బాలయ్య అంటూ నందమూరి బాలక్రిష్ణ ఫాన్స్ స్లొగన్స్ చేయగా, చివరికి బాలయ్య నటించిన సినిమాలలోని పాటలు పాడి అందరినీ ఉత్సాహపరిచారు.







