TANA: విజయవంతమైన 24 వ తానా మహాసభలు.. మంచి భవిష్యత్తు కు తానా ముందడుగు….
ఒక విధంగా చెప్పాలంటే… తానా కి ఇది పరీక్షా సమయం. గత సంవత్సరం హఠాత్తు గా మీద పడ్డ మచ్చ (తానా ఫౌండేషన్ ట్రెజరర్ తానా నిధులు కొట్టేయడం) వలన అసలు కాన్ఫరెన్స్ జరపాలా? వద్దా? అన్న మీమాంశ; కాన్ఫరెన్స్ చెయ్యాలి అంటే కావలసిన డబ్బులు విరాళాలు ద్వారా తేగలమా? అన్న డైలమా; తానా కి ఉన్న పేరు ప్రతిష్టలు తగ్గకుండా కాన్ఫరెన్స్ జరపటానికి ముందుకొచ్చే నాయకులు ఎవరు? ; లాంటి అనేక సందేహాల మధ్య దాదాపు 9 నెలలుగా చేసే పనులు కేవలం 4 నెలలలో ( మార్చి మొదటి వారం నుంచి జూలై మొదటి వారం వరకు ) పూర్తి చేసి, కాన్ఫరెన్స్ ను విజయవంతం గా నిర్వహించిన కాన్ఫరెన్స్ నాయకులకు అభినందనలు చెప్పాలి.
ఎవరో కొందరు చేసిన తప్పుకు శిక్ష 48 సంవత్సరాలు గా తెలుగు కమ్యూనిటీ కి అమెరికాలో ఒక పక్క, తెలుగు రాష్ట్రాలలో ఇంకో పక్క ఎంతో సేవ చేస్తున్న తానా (TANA) సంస్థ కా ? గత ఎన్నో సంవత్సరాలుగా అమెరికా లో తెలుగు వారికి ఆపద సమయం లో గుర్తుకు వచ్చే తానా సంస్థ కే ఆపద వస్తే కారణం ఎవరు ? అని కథలు చెప్పుకుందామా? గుసగుసలాడు కొందామా? లేదా కబుర్లు, పుకార్లు ను దాటి సంస్థ ను ఆపద నుంచి బయటకు తెచ్చి పూర్వ వైభవం తీసుకు వద్దామా? ఈ 2025 జనవరి నెలలో తానా అగ్ర నాయకత్వానికి వచ్చిన పెద్ద సవాల్ ఇది. దాదాపు 80000 మంది కి పైగా సభ్యులు, 80 మంది పైగా వివిధ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కార్య వర్గ సభ్యులు ఉన్న తానా నాయకత్వం ముందు రెండు పెద్ద పనులు ఉన్నాయి. ఒకటి – 24 వ తానా మహాసభలు జరపటం, రెండు – కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం.
గత 15 ఏళ్లుగా తెలుగు సంఘాల కు ప్రతి రెండు ఏళ్ళు కి ఒకసారి నిర్వహించే కాన్ఫరెన్స్ కి ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. అలాగే అయ్యే ఖర్చు కు తగ్గట్టు గా విరాళాలు ఇచ్చే దాతలు, స్పాన్సర్ చేసే కంపెనీలు కూడా పెరిగాయి. కానీ కాన్ఫరెన్స్ చేసే నాయకులు ఈ ఖర్చులను ఒక పక్క – ఫండ్ రైజింగ్ పనులు రెండో పక్క చూసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ సవాల్ ని 24వ తానా కాన్ఫరెన్స్ నాయకత్వం చాలా గొప్పగా నిర్వహించింది అని చెప్పాలి. ప్రతి పట్టణంలో డౌన్ టౌన్ లో వుండే పెద్ద కన్వెన్షన్ సెంటర్ కి వెళ్లకుండా, సిటీ లోనే ఉన్న ఎక్స్పో సెంటర్ లో కాన్ఫరెన్స్ నిర్వహించడం, ఆర్భాటాలకు పోయి ఖర్చు పెంచకుండా ప్రతి విషయంలో జాగ్రత్త గా ముందుకు వెళ్లడం, అదే సమయం లో ఎక్కడా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ప్రోగ్రాం తయారు చేయడం ఇందుకు నిదర్శనాలు.
మొదటగా జరిగిన Banquet Dinner ప్రోగ్రాం లో ఎప్పుడూ ఇచ్చే తానా ఎక్స్ లెన్స్ అవార్డ్స్ తో పాటు, తానా మెరిటోరియస్ అవార్డ్స్, తానా సర్వీస్ రెకగ్నిషన్ అవార్డ్స్ అంటూ నెహ్రు చెరుకుపల్లి, తిరుమల రావు తిపిర్నేని, ప్రసాద్ తోటకూర లాంటి సీనియర్స్ ని, డా రఘు ముక్కామల, వీర్నపు చిన సత్యం లాంటి వ్యక్తులను వివిధ రంగాల నుంచి గుర్తించి వారికి అవార్డ్స్ ఇచ్చి అవార్డ్స్ ప్రోగ్రాం కి వన్నె తెచ్చారు. అన్ని నగరాలలో ధీమ్- తానా పోటీలు నిర్వహించి, కాన్ఫరెన్స్ లో విజేతలను ఫైనలైజ్ చేసే ప్రక్రియ వలన కొత్త వారు తానా కి కనెక్ట్ అయ్యారు. ఇక్కడి యువత ను కలుపుకుంటూ రెడీ చేసిన యూత్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్స్ కి ప్రైమ్ టైమ్ లో అవకాశం ఇచ్చారు. ఆ సెగ్మెంట్ ను చక్కగా నిర్వహించిన విశాల్ బెజవాడ కు అభినందనలు. అలాగే బ్రేక్ అప్ సెషన్స్ బాగున్నాయి. రెండు రోజుల ప్రైమ్ టైమ్ ప్రోగ్రామ్స్ చాలా ఎంటర్టైనింగ్ గా అందరికీ పూర్తి సంతృప్తి ని ఇచ్చాయి. ఏది జరిగినా మన మంచికే అన్న చందాన, రెండు రోజులలోనూ తక్కువ మంది రాజకీయ నాయకులు వలన ప్రైమ్ టైమ్ ప్రోగ్రాం చాలా crisp గా, ఎక్కువ ఎంటర్టైనింగ్ గా వుంది.
కాన్ఫరెన్స్ జరుగుతుందా ? అన్న సంశయం ను అధిక మించి తక్కువ ఖర్చుతో మంచి కాన్ఫరెన్స్ చేసిన శ్రీ గంగాధర్ నాదెళ్ల, శ్రీ ఉదయ్ చాపల మడుగు లకు వేల వేల అభినందనలు. కాన్ఫరెన్స్ ని అద్భుతంగా నిర్వహించిన డిట్రాయిట్ టీమ్ కి కూడా అభినందనలు. తానా సంస్థ కు పూర్వ వైభవం తీసుకు రావడానికి మొదటి మెట్టు ఎక్కించిన ఘనత ఈ కాన్ఫరెన్స్ నిర్వాహకులదే !!
పైన చెప్పినట్టు, తానా నాయకత్వానికి రెండవ సవాల్- కాన్ఫరెన్స్ నాటికి ఎన్నికలు జరిగి నూతన కార్యవర్గం ను సిద్ధం చేయడం. ఇది కూడా ఒక రాజ్యాంగ సంక్షోభమే.. తానా ఫౌండేషన్ లో జరిగిన ఫైనాన్సియల్ ఫ్రాడ్ వలన మసక బడిన ఈ సమయం లో ఎన్నికలు జరపడానికి సమయం లేదు మరియు పరిస్థితులు కూడా లేవు. ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి ? అన్న సందేహాలల్తో, అనేక ప్రశ్నలతో, ప్రత్యక్ష ఎన్నికలు జరపలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్దంగా పరోక్ష పద్దతి లో ఎన్నికలు నిర్వహించి నూతన నాయకత్వాన్ని సిద్ధం చేసిన తానా నాయకత్వానికి అభినందనలు. అలాగే ఎన్నికైన అందరికి శుభాకాంక్షలు.
రెండో రోజు చివరగా 2025-27 పీరియడ్ కి తానా అధ్యక్షులు గా డా. నరేన్ కోడాలి, ఆ తరువాత కార్య వర్గ సభ్యులు గా బాధ్యతలు స్వీకరించిన నాయకులందరికీ అభినందనలు.. శుభాకాంక్షలు.. ఆ క్షణమే కాన్ఫరెన్స్ హాల్ లో ఉన్న వారు, బయట ఉన్న తానా సభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ ఆనందించారు. అభినందించారు. తానా ని మళ్ళీ పూర్తి స్థాయి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చి 2027 లో బంగారు తానా కి స్వర్ణోత్సవాలు జరిపే బాధ్యత వీరిదే!







