డల్లాస్ లో ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికాలోని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజీఎంఎన్టీ) ఆధ్వర్యంలో డల్లాస్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొన్నారు. ఎంజీఎంఎన్టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి 200 మంది ప్రవాసీయులు, ఎన్నారైల ప్లిలలు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ఈ వేడుకలకు తరలివచ్చిన ప్రవాసీయులకు ఎంజీఎంఎన్టీ సెక్రటరీ రావు కాల్వల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంజీఎంఎన్టీ చైర్మన్ అయిన ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం అనంతరం భారత, అమెరికా జాతీయ గీతాలు ఆలపించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రతి మతానికి భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలు ఉన్నాయనీ, అయితే భారతీయులంతా భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తుంటారని తెలిపారు. విలువలు, విధానాలు, అధికారాలు, విధులు బాధ్యతలతోపాటు దేశ పౌరులకు హక్కులను భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు అమితంగా కష్టపడిన డాక్టర్ బీఆర్. అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు సర్వస్వం త్యాగం చేసిన మహాత్మాగాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎంజీఎంఎన్టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కమల్ కౌషల్ సూచించారు. పది ఆసియా దేశాధినేతల సమక్షంలో భారత్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయనీ, దాన్ని స్పూర్థిగా తీసుకుని 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను డల్లాస్లో జరుపుకుంటున్నామని ఎంజీఎంఎన్టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శభనం మోడ్గిల్ అన్నారు. జనవరి 30వ తారీఖున మరోసారి అమెరికాలో ప్రవాసులంతా డల్లాస్లోని గాంధీ విగ్రహం వద్దకు వచ్చి గాంధీజీ వర్ధంతిని జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన వాలంటీర్లకు, ఎంజీఎంఎన్టీ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.













