అంగరంగ వైభవంగా టైమ్‌స్క్వేర్‌లో దీపావళి వేడుకలు.. హాజరైన సెనెటర్లు, భారతీయ ప్రముఖులు
భారతీయుల పెద్ద పండుగ దీపావళి వేడుకలను అమెరికా రాజకీయ ప్రముఖులతో కలిసి టైమ్ స్క్వేర్ లో భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, సెనేటర్ చక్ షుమర్, డిప్యూటీ మేయర్ మీరా జోషి, భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, అసెంబ్లీ మహిళ జెనిఫర్ రాజ్‌కుమార్, జస్టిస్ కరెన్ గోపీ మరియు పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. కాలిఫోర్నియాకు చెందిన డెయిరీ ఫామ్ గోపీ డెయిరీ ఈ వేడుకలకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. కియా ఈ వేడుకలను స్పాన్సర్ చేసింది. పలు నగరాల్లో దీపావళి పండుగను సెలవుదినంగా కూడా ప్రకటించడంతోపాటు అధికారిక గుర్తింపును అందించారు. ఈసారి టైమ్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు భారీ ఎత్తున జరగడం విశేషం.
దీపాల పండుగ దీపావళి. సాంప్రదాయకంగా చెడుపై సాధించిన విజయానికి చిహ్నంగా, చీకటి నుంచి వెలుగును ప్రసారించే ఈ దీపావళి వేడుకలను భారతీయులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు ఈ దీపావళి వేడుకలను తాము ఉంటున్న ప్రదేశంలో కూడా అందరితో కలిసి వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. టైమ్స్ స్క్వేర్, 2023లో జరిగిన దీపావళి వేడుకలు మరింత వైభవంగా జరగడంతోపాటు అమెరికా రాజకీయ నాయకులు, భారతీయ నాయకులు పెద్దఎత్తున రావడం ఈ వేడుకలకు మరింత వైభవాన్ని సంతరించుకునేలా చేసింది.
విభిన్న నేపథ్యాల ప్రజలను ఏకం చేయడం, ఏకత్వం మరియు భిన్నత్వాన్ని పెంపొందించడానికి విద్యపై దృష్టి సారించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుందని టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి వ్యవస్థాపకురాలుగా ఉన్న నీతా భాసిన్ అన్నారు. కియా అమెరికా సిఓఓ, ఇవిపి గా ఉన్న స్టీవెన్ సెంటర్ మాట్లాడుతూ, భారతీయుల పెద్ద వేడుకకు తాము స్పాన్సర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించిన కాలిఫోర్నియాకు చెందిన గోపి డెయిరీ కంపెనీ దశాబ్దకాలంగా దక్షిణాసియా కమ్యూనిటీకీ సేవలు అందిస్తోంది. గోపి మార్కెటింగ్ మేనేజర్ అన్నీ కెరోపియన్-దిల్సిజియన్ మాట్లాడుతూ ఇటువంటి చరిత్రాత్మక వేడుక, భారతీయులు వైభవంగా జరుపుకునే వెలుగుల పండుగ దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కంపెనీ ఉత్పత్తులను వచ్చినవారికి అందించారు.
ఈ వేడుకల్లో ఆయా రంగాల్లో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను అవార్డులతో సత్కరించారు. యుఎస్ డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ డైరెక్టర్ నీరా టాండెన్ ను ‘‘ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇన్ పబ్లిక్ సర్వీస్’’తో సత్కరించారు. ప్రొక్టర్ అండ్ గాంబుల్ సిఓఓ శైలేష్ జెజురికర్ ‘‘ప్రైవేట్ సర్వీస్‌లో మ్యాన్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డును అందుకున్నారు. న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవును ప్రకటించేలా చేయడంలో కీలకపాత్ర పోషించిన మరియు టైమ్స్ స్క్వేర్‌లో దీపావళికి బలమైన మద్దతుదారు అయిన అసెంబ్లీ మహిళ జెనిఫర్ రాజ్‌కుమార్ కు సమ్మాన్ అవార్డును అందించారు.
బాలీవుడ్ సంచలనం మికా సింగ్, భారతీయ అమెరికన్ గాయని షుబా మరియు స్థానిక ప్రతిభావంతులతో జరిగిన సంగీత కచేరీ ఆకట్టుకుంది.













